Telugu Global
Andhra Pradesh

పాపం వీళ్ళ పరిస్థితి ఏమిటో..?

ఇప్పుడైతే వీళ్ళకి ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు దక్కేది అనుమానమే అని తమ్ముళ్ళు చెబుతున్నారు. తప్పదంటే ఆనం, కోటంరెడ్డికి ఇస్తే టికెట్లు ఇవ్వచ్చుకాని మిగిలిన ఇద్దరికీ కష్టమనే అంటున్నారు.

పాపం వీళ్ళ పరిస్థితి ఏమిటో..?
X

దాదాపు ఏడాది క్రితమే టీడీపీతో కలిసిన నలుగురు వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలకే ఇప్పటివరకు టికెట్లకు గ్యారంటీలేదు. అలాంటిది ఇప్పుడు వైసీపీలో నుండి టీడీపీలోకి మారుతున్న, మారబోతున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైవుతుందో అర్థంకావటంలేదు. జగన్మోహన్ రెడ్డితో విభేదించి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి దగ్గరైన విషయం తెలిసిందే. ఈమధ్యనే కోటంరెడ్డి, మేకపాటి, ఉండవల్లి డైరెక్టుగా టీడీపీ కండువా కప్పేసుకున్నారు.

టీడీపీ కండువా కప్పుకోకపోయినా ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి టీడీపీ ఆఫీసులో మీటింగులకు హాజరవుతున్నారు. కాబట్టి పై నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళకిందే లెక్క. అప్పట్లో వీళ్ళ నలుగురికి ఏమి హామీలిచ్చి చంద్రబాబు పార్టీలోకి తీసుకున్నారో తెలీదు. ఇప్పుడైతే వీళ్ళకి ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు దక్కేది అనుమానమే అని తమ్ముళ్ళు చెబుతున్నారు. తప్పదంటే ఆనం, కోటంరెడ్డికి ఇస్తే టికెట్లు ఇవ్వచ్చుకాని మిగిలిన ఇద్దరికీ కష్టమనే అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో పెనమలూరు ఎమ్మెల్యేలు కొలుసు పార్థ‌సారధి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కొలుసుకే టికెట్ హామీ లేనప్పుడు ఇక రక్షణనిధి ఏమి ఇస్తారు..? అలాగే విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ కూడా టీడీపీలో చేరబోతున్నారు. ఈయనకూ టికెట్ అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఉన్నారు. వీళ్ళే కాదు భవిష్యత్తులో వైసీపీని వదిలేసి టీడీపీలో చేరబోయే వాళ్ళల్లో చాలామందికి టికెట్లు దక్కేది అనుమానమే.

విచిత్రం ఏమిటంటే.. అవసరానికి పని జరిపించుకునేందుకు చంద్రబాబు నోటికొచ్చిన హామీ ఇచ్చేస్తారు. అవసరం తీరిపోగానే హామీలను పట్టించుకోరు, నేతలనూ దగ్గరకు రానివ్వ‌రు. దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. అయినా చాలామంది నేతలు చంద్రబాబునే నమ్ముతారు. టీడీపీలోకి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు ఏమి హామీలిచ్చి తీసుకుంటున్నారో ఎవరికీ తెలీదు. అయితే చాలామంది ఎమ్మెల్యే టికెట్ మీద హామీతోనే చేరుతారన్నది వాస్తవం. ఇలా చేరేవాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

First Published:  18 Jan 2024 5:34 AM GMT
Next Story