Telugu Global
Andhra Pradesh

'ఇదేం ఖర్మ'.. బెడిసికొడుతోందా?

కృష్ణా జిల్లా పెనమలూరులో ఈ కార్యక్రమం నిర్వహించగా.. ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మినహా.. ప్రజలెవరూ ఈ ప్రోగ్రామ్ వద్దకు రాలేదు. మద్దతు తెలపలేదు.

ఇదేం ఖర్మ.. బెడిసికొడుతోందా?
X

అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో నిరసనలు, చేపట్టడం ఆందోళనలు చేయడం సహజమే. కేవలం ప్రెస్ మీట్లు మాత్రం పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారపడితే సరిపోదు. ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే కచ్చితంగా ప్రజల నాడిని గుర్తించి, వారి అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఫలానా నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. కాగా, ఇందులో భాగంగానే ప్రజలను ఆకట్టుకొనేందుకు తెలుగుదేశం పార్టీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

గతంలో బాదుడే బాదుడే అంటూ ప్రజల్లోకి వెళ్లింది. రాష్ట్రంలో నిత్యావసరసరుకుల ధరలు, విద్యుత్, పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రజలను నమ్మించేందుకు యత్నించింది. అయితే ఈ కార్యక్రమం పెద్దగా సఫలీకృతం అయినట్టు లేదు. పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు తమ పరిధిలోవి కావని.. వీటిని కేంద్రం నిర్ణయిస్తుంది కాబట్టి.. కేంద్రం మీద టీడీపీ యుద్ధం చేస్తే బాగుంటుందని అధికార పక్షం రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. దీంతో తెలుగుదేశం నేతలు ఇరుకునపడ్డారు.

ఇదిలా ఉంటే తాజాగా ఇదేం ఖర్మ.. అంటూ ఓ కార్యక్రమాన్ని రూపొందించింది టీడీపీ. ఇటీవల నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు అట్టహాసంగా తమ పార్టీ వాళ్లకు ఈ కార్యక్రమం గురించి వివరించారు. అయితే టీడీపీకి రాజకీయ సలహాలు ఇస్తున్న రాబిన్ శర్మ అనే వ్యక్తి ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు సమాచారం. అయితే ఈ కార్యక్రమంపై పార్టీలోనే కొంత అసంతృప్తి మొదలైంది. ప్రోగ్రాం పేరు ఏమంత బాగాలేదని.. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చంద్రబాబుకు ఓ సలహా ఇచ్చారు కూడా..

తాజాగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిర్వహిస్తోంది. జగన్ ప్రభుత్వం ఏమీ అభివృద్ధి చేయలేదని.. మేం అధికారంలోకి వస్తే బాగా అభివృద్ధి చేస్తామని టీడీపీ క్యాడర్ ఫ్లెక్సీలు, ప్లకార్డులు రూపొందించి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దగా మద్దతు దక్కడం లేదని సమాచారం. కృష్ణా జిల్లా పెనమలూరులో ఈ కార్యక్రమం నిర్వహించగా.. ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మినహా.. ప్రజలెవరూ ఈ ప్రోగ్రామ్ వద్దకు రాలేదు. మద్దతు తెలపలేదు.

మరో వైపు వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేతలను అడ్డుకొనేందుకు ప్రయత్నించగా కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పోలీసులు ఇరు వర్గాల నేతలకు సర్దిచెప్పారు. ఇదేం కర్మ రాష్ట్రానికి అన్న టైటిల్ కూడా టీడీపీ శ్రేణులకు పెద్దగా నచ్చినట్టు కనిపించడం లేదు. దీనిమీద ఇప్పటికే సీఎం జగన్ కౌంటర్లు కూడా వేశారు. ఇదేం ఖర్మ అని భావించే ప్రజలు చంద్రబాబుకు ఉద్వాసన పలికారని.. మళ్లీ ఆ ఖర్మను తెచ్చుకోలేరు కదా..అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ ప్రోగ్రామ్‌ను టీడీపీ శ్రేణులు ఎలా ముందుకు తీసుకెళ్తాయే వేచి చూడాలి.

First Published:  22 Nov 2022 9:45 AM GMT
Next Story