Telugu Global
Andhra Pradesh

మైనార్టీలు చంద్రబాబును నమ్ముతారా..?

మామూలుగానే టీడీపీకి ముస్లిం మైనారిటీలు దూరమైపోయి పదేళ్ళయింది. 2014, 2019 ఎన్నికల్లో ఒక్క ముస్లింనేత కూడా టీడీపీ తరఫున గెలవలేదు.

మైనార్టీలు చంద్రబాబును నమ్ముతారా..?
X

ముస్లిం మైనారిటీలతో చంద్రబాబు నాయుడు సుదీర్ఘ భేటీ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో తమ కూటమికి ముస్లిం మైనారిటీలు అండగా నిలవాలని వేడుకున్నారు. ముస్లింలకు తాను ఎంతసేవ చేసింది గుర్తుచేశారు. ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న, చేసిన ద్రోహాన్ని వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బతిమలాడుకున్నారు. తొందరలోనే ముస్లింల కోసం ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించబోతున్నట్లు హామీ ఇచ్చారు. ఇలాంటి హామీలు చంద్రబాబు బోలెడన్ని ఇచ్చారు. హామీలు ఇవ్వటానికి ఖర్చేమీలేదు కాబట్టి చంద్రబాబు ఎన్నయినా ఇస్తారు.

పైగా ఇచ్చిన హామీని నిలుపుకునే విషయంలో చంద్రబాబు ట్రాక్ రికార్డు చాలా ఘనంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మామూలుగానే టీడీపీకి ముస్లిం మైనారిటీలు దూరమైపోయి పదేళ్ళయింది. 2014, 2019 ఎన్నికల్లో ఒక్క ముస్లింనేత కూడా టీడీపీ తరఫున గెలవలేదు. అందుకనే వైసీపీ తరపున 2014లో గెలిచిన ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, అత్తార్ చాంద్ బాషాను ప్రలోభ పెట్టి లాక్కున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసినందుకు గుంటూరు సభలో ఎనిమిదిమంది ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టించి చావకొట్టించారు.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 2019 ఎన్నికల్లో కూడా ముస్లిం సామాజికవర్గం వైసీపీనే గెలిపించింది. అలాంటిది రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ఏమో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను ఎత్తేస్తామని, కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తామంటోంది. మోడీ, అమిత్ షా ప్రకటనలతో ముస్లింల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలు టీడీపీకి ఓట్లేస్తారని చంద్రబాబు ఎలాగనుకున్నారో అర్థంకావటంలేదు. ప్రస్తుతం చంద్రబాబు ముస్లింల్లో ముగ్గురికి టికెట్లిస్తే జగన్ ఏడుగురికి టికెట్లిచ్చారు.

హామీలిచ్చి మోసం చేయటమే చంద్రబాబు నైజమని ఇప్పటికే జనాలు మాట్లాడుకుంటున్నారు. అలాంటిది ముస్లింలకు అండగా ఉంటానని చంద్రబాబు చెబితే ఎవరు నమ్మరు. ఎందుకంటే కూటమి గెలిచినా చంద్రబాబు మోడీ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే తప్ప స్వతంత్రంగా వ్యవహరించే అవకాశంలేదు. అలాంటప్పుడు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఎత్తేయాలని, సీఏఏ అమలు చేయాలని మోడీ చెబితే చంద్రబాబు కచ్చితంగా అమలుచేయాల్సిందే తప్ప వేరేదారిలేదు. కాబట్టి ముస్లింలకు ఇప్పుడిస్తున్న హామీలన్నీ నీటిమీద రాతలే అని అందరికీ తెలుసు. మరి రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు ఏమిచేస్తారో చూడాలి.

First Published:  20 March 2024 5:26 AM GMT
Next Story