Telugu Global
Andhra Pradesh

ఈ నియోజకవర్గాల్లో జగన్ సక్సెస్ అవుతారా..?

బాగా సమస్యాత్మకంగా ఉండే గన్నవరం, చీరాల, అద్దంకి, టెక్కలి, పర్చూరు నియోజకవర్గాలపైన ముందుగా దృష్టిపెట్టినట్లు సమాచారం. నగరి, గిద్దలూరు, నెల్లూరు రూరల్, వెంకటగిరి లాంటి నియోజకవర్గాల పంచాయితీలను కూడా తొందరలోనే పరిష్కరించాలని అనుకున్నారట.

ఈ నియోజకవర్గాల్లో జగన్ సక్సెస్ అవుతారా..?
X

వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. జగన్ టార్గెట్ రీచ్ అవుతారా లేదా అన్నది పక్కనపెట్టేస్తే కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యల పరిష్కారంపై గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బాగా సమస్యాత్మకంగా ఉండే గన్నవరం, చీరాల, అద్దంకి, టెక్కలి, పర్చూరు నియోజకవర్గాలపైన ముందుగా దృష్టిపెట్టినట్లు సమాచారం. నగరి, గిద్దలూరు, నెల్లూరు రూరల్, వెంకటగిరి లాంటి నియోజకవర్గాల పంచాయితీలను కూడా తొందరలోనే పరిష్కరించాలని అనుకున్నారట.

గన్నవరంలో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతుగా ఉన్నారు. వంశీని యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళ పంచాయితీలపై గతంలోనే మాట్లాడినా.. మళ్ళీ ఇప్పుడు దృష్టిపెట్టారట. ఈ వర్గాలన్నీ కలిసి పనిచేస్తే వైసీపీ గన్నవరంలో గెలవటం ఖాయమని జగన్ అనుకుంటున్నారు. చీరాలలో పోటీచేయాలని కరణం వెంకటేష్, ఆమంచి కృష్ణమోహన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయమై ఆమంచితో జగన్ ఇప్పటికే మాట్లాడారట. ఆమంచిని చీరాల కాకుండా పర్చూరులో పోటీచేసేట్లుగా ఒప్పించారని సమాచారం.

అయితే ఆమంచి ఎంతవరకు సానుకూలంగా ఉంటారో చెప్పటం కష్టమంటున్నారు. చీరాలలో పోటీచేసి గెలిస్తే సరి, లేకపోతే ఎంఎల్సీ ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. చివరకు ఏమవుతుందో చూడాలి. అద్దంకిలో టీడీపీ ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ ను ఓడించేందుకు బాచిన కృష్ణచైతన్యను జగన్ రంగంలోకి దింపుతున్నారు. అయితే ఇక్కడి నుండి పోటీచేయటానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరిని చైతన్య గెలుపున‌కు పనిచేసేట్లుగా జగన్ ప్రయత్నిస్తున్నారు.

ఇక టెక్కలిలో అచ్చెన్నాయుడు ఓటమికి జగన్ ప్లాన్ రెడీచేస్తున్నారు. పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన పేరాడ తిలక్ స్ధానంలో ఎంఎల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ ప్రకటించారు. దాంతో తిలక్ అలిగారట. అందుకనే తిలక్ ను జగన్ పిలిపించుకుని అచ్చెన్న ఓటమి కోసం దువ్వాడతో కలిసి పనిచేయాలని గట్టిగా చెప్పారట. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంఎల్సీగా నామినేట్ చేస్తానని తిలక్ కు జగన్ హామీ ఇచ్చారు. కానీ తిలక్ ఏమిచేస్తారో చూడాలి. ఇలాంటి మరికొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు సర్దుబాటుచేయటంపై జగన్ దృష్టిపెట్టారు. మరి ఈ నియోజకవర్గాల్లో రిజల్ట్‌ ఎలాగుంటుందో చూడాల్సిందే.

First Published:  14 Nov 2022 8:59 AM GMT
Next Story