Telugu Global
Andhra Pradesh

ప్రధాని సభకు పవన్.. సోము వీర్రాజు సమాధానం ఏంటంటే..?

ప్రస్తుతం పవన్ కల్యాణ్ బీజేపీకి మిత్రుడే అయినా కేంద్రంలోని పెద్దల అపాయింట్‌మెంట్ ఆయనకు దొరకడం లేదు. కనీసం వారు ఏపీకి వచ్చినా పవన్‌ని పలకరించిన పాపాన పోలేదు.

ప్రధాని సభకు పవన్.. సోము వీర్రాజు సమాధానం ఏంటంటే..?
X

ఏపీలో రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. బీజేపీ అంటే అటు అధికార వైసీపీకి ఇటు ప్రతిపక్ష టీడీపీకి.. రెండు పార్టీలకు అభిమానమే. మోదీని పల్లెత్తు మాట అనకుండా రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటుంటాయి. ఇక బీజేపీకి అధికారిక మిత్రపక్షం జనసేన సైతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లకు సైతం వైసీపీదే తప్పంటూ విమర్శిస్తుంటుంది. ఈ దశలో అసలు బీజేపీ రాష్ట్ర శాఖ ఏం తేల్చుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉంది. ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ఈ వ్యవహారం మరింత ముదిరింది. అయితే ఈ సభకు బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి ఆహ్వానం ఉందా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది.

ఆమధ్య అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం ఏపీకి వచ్చిన ప్రధాని మోదీ, చిరంజీవిని ప్రత్యేకంగా ఆ కార్యక్రమానికి ఆహ్వానించి ఆయన్ను ఆలింగనం చేసుకుని సరికొత్త సంకేతాలిచ్చారు. అదే సమయంలో వైసీపీ కూడా మోదీ ప్రాపకం కోసం బాగానే ఆశపడింది. తాజాగా విశాఖ పర్యటన సందర్భంగా ఆ గౌరవం మరింత ఎక్కువైంది. విశాఖలో మోదీ పర్యటనను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా రెండు వారాల ముందుగానే వైసీపీ నేతలు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్లేవీ రాష్ట్ర బీజేపీకి నచ్చడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తమ క్రెడిట్‌గా చెప్పుకోడానికి వైసీపీ ఉబలాటపడుతోందన్నారు సోము వీర్రాజు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో ఈ సభ విజయవంతం చేయడానిక కృషి చేస్తున్నామని చెప్పారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేస్తారని వివరించారు. జనసేనాని పవన్ కల్యాణ్‌ని ఈ సభకు ఆహ్వానించారా అనే ప్రశ్నకు మాత్రం ఆయన నో కామెంట్ అంటూ వెళ్లిపోయారు.

విశాఖలో మోదీ సభ, వైసీపీ కనుసన్నల్లో జరుగుతుంది. అంటే వైపీకి హితులు, సన్నిహితులే ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంటుంది. చిరంజీవి రాజకీయాల్లో తటస్థంగా ఉన్నారు కాబట్టి అప్పట్లో ఆయన్ని వేదికపైకి ఆహ్వానించినా జగన్ పెద్దగా ఫీల్ కాలేదు. ఇప్పుడు పవన్‌ని ఆహ్వానిస్తామంటే వైసీపీ ఊరుకోదు. అందుకే పవన్‌కి ఈ సభ విషయంలో ఎంట్రీ లేదని తేలిపోయింది. కానీ పవన్ కల్యాణ్‌కి మాత్రం ఇలాంటి ఆహ్వానాలు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ, పవన్‌ని ఆహా ఓహో అంటూ ఆకాశానికెత్తేశారు. ఆ తర్వతా కూడా హస్తినలో పవన్‌కి రెడ్ కార్పెట్ స్వాగతాలు ఏర్పాటు చేసేవారు. కానీ ఆ తర్వాత పరిస్థితి తేడా కొట్టింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ బీజేపీకి మిత్రుడే అయినా కేంద్రంలోని పెద్దల అపాయింట్‌మెంట్ ఆయనకు దొరకడం లేదు. కనీసం వారు ఏపీకి వచ్చినా పవన్‌ని పలకరించిన పాపాన పోలేదు. తాజాగా ప్రధాని విశాఖ పర్యటనకు కూడా పవన్‌ని దూరం పెడుతున్నారని తేలిపోయింది. గతంలో మోదీ పర్యటనను జనసైనికులు విజయవంతం చేయండి అంటూ పవన్ ఓ ట్విట్టర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ సారి కనీసం సోషల్ మీడియాలో అయినా స్పందిస్తారా ? లేక అవమానం జరిగిందని సైలెంట్‌గా ఉంటారా.. ? వేచి చూడాలి.

First Published:  7 Nov 2022 11:19 AM GMT
Next Story