Telugu Global
Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు యూ టర్న్

తాను పార్టీ మారవచ్చునంటూ వ్యాఖ్యానించిన వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు యూ టర్న్ తీసుకున్నారు. తానసలు అలా మాట్లాడలేదని ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ ద్వజమెత్తారు.

వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు యూ టర్న్
X

జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్.. తాను పార్టీ మారవచ్చునంటూ వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారాయన.. 'నేను పార్టీ మారవచ్చునని కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేశారు.. అంతా అబద్ధం.. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు.. ప్రతిపక్షాలను ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు'.అని తాజా స్టేట్మెంట్ ఇచ్చారు. పైగా.. అందరికీ అర్థమయ్యేలా మాట్లాడలేకపోయా అని తన 'నిస్సహాయత'ను బయట పెట్టుకున్నారు. ఈ మధ్య ఆయన ''పార్టీ లేదు.. గాడిద గుడ్డూ లేదు.. .ఎవరు, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలుసు'' అని వ్యాఖ్యానించి బాంబు పేల్చారు. వైసీపీలో శాశ్వతంగా ఉండబోవడం లేదని, పెన్షన్ తీసుకునే సామాన్యులు ఆదాయం పన్ను ఎలా కట్టగలరని ప్రశ్నించిన ఆయన.. వ్యక్తులు పార్టీలకు శాశ్వతం కాదని కూడా వైరాగ్యంగా మాట్లాడారు. పార్టీలు ఇవాళ ఉంటాయి.. రేపు పోతాయి.. ఏ పార్టీలో ఎవరూ పర్మనెంట్ కాదు అని కూడా మాట్లాడారు. చంటిబాబు చేసిన ఈ కామెంట్స్ ఇటీవల హాట్ హాట్ గా పేలాయి.

ఇలా మాట్లాడి మూడు రోజులైనా అయిందో లేదో.. అబ్బే ! అంతా ప్రతిపక్షాల కుట్ర అన్నట్టు మాట మార్చేశారు. పైగా తన వ్యాఖ్యల్ని వక్రీకరించారట. లోగడ టీడీపీలో ఉండి తరువాత వైసీపీలో చేరిన ఆయన.. తన వివాదాస్పద కామెంట్లతో మళ్ళీ పార్టీ మారిపోతారా అన్న ఊహాగానాలు పెల్లుబికాయి. పింఛను కోసం వచ్చినవారికోసం ఏర్పాటైన కార్యక్రమానికి హాజరై చంటిబాబు చేసిన ప్రసంగం వీడియోల్లో స్పష్టంగా ఉంది. ఈయన స్పీచ్ వైసీపీ హైకమాండ్ దృష్టికి వెళ్లినట్టుంది. గట్టి డోస్ ఇచ్చేసరికి ఎందుకొచ్చిన తంటా అనుకుంటూ మళ్ళీ గొంతు సవరించేసుకున్నారు.




First Published:  7 Aug 2022 3:54 AM GMT
Next Story