Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు ‘తెలంగాణ అనుభవం’ తప్పదా..?

గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జనసేన తన పార్టీ కన్నా ఎక్కువ ఓట్లను సాధించిన నియోజకవర్గాలను చంద్రబాబు ఆ పార్టీకి కేటాయించలేదు.

చంద్రబాబుకు ‘తెలంగాణ అనుభవం’ తప్పదా..?
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన 2009 ఎన్నికల నాటి అనుభవం ఎదురయ్యే అవకాశాలున్నాయి. అప్పటి టీఆర్‌ఎస్‌తో సీట్ల పంపకంలో జరిగిన అశాస్త్రీయ విధానం వల్ల టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చంద్రబాబు చేసిన సీట్ల కేటాయింపు వల్ల టీఆర్‌ఎస్‌కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ 294 స్థానాల్లో 156 సీట్లు సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అదే సెంటిమెంటు కొనసాగే అవకాశాలున్నాయి. చంద్రబాబుకు మరోసారి నిరాశ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ రెండో సారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి టీడీపీ, జనసేన మధ్య జరిగిన అశాస్త్రీయమైన సీట్ల పంపకం కూడా కారణమవుతోంది.

చంద్రబాబు 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 45 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. అందులో పది మాత్రమే టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. టీడీపీకి 92 స్థానాలు వచ్చాయి. సీట్ల పంపకంలో సరైన పద్ధతి పాటించకపోవడం వల్ల టీఆర్‌ఎస్‌ పలు సీట్లలో ఓటమి పాలైంది. టీఆర్‌ఎస్‌కు ఏ మాత్రం బలం లేని హుజూర్‌నగర్‌, నాంపల్లి వంటి సీట్లను చంద్రబాబు ఆ పార్టీకి కేటాయించారు. బహుశా టీఆర్‌ఎస్‌ను దెబ్బ తీసే ఉద్దేశంతో చంద్రబాబు అలా చేసి వుండవచ్చు. కానీ అది ఆయనకే ఎదురు తిరిగింది. ఇప్పుడు జనసేనతోనూ చంద్రబాబు అదే డ్రామా ఆడినట్లు కనిపిస్తున్నారు.

జనసేన బలంగా ఉన్న సీట్లలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను నిలబెడుతున్నారు. గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జనసేన తన పార్టీ కన్నా ఎక్కువ ఓట్లను సాధించిన నియోజకవర్గాలను చంద్రబాబు ఆ పార్టీకి కేటాయించలేదు. 2019 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసి ఓడిపోయిన రెండు సీట్లతో పాటు జనసేన గెలిచిన సీటును కలిపి ఆ పార్టీ 15 స్థానాల్లో 30 వేలకు పైగా ఓట్లను రాబట్టుకుంది. ఈ 15 సీట్లలో ఏడు సీట్లను చంద్రబాబు టీడీపీ అభ్యర్థులకు కేటాయించారు. మిగతా సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ 15 సీట్లలో ఒక్క కాకినాడ రూరల్‌ స్థానాన్ని మాత్రమే జనసేనకు కేటాయించారు.

ఈ సీట్ల కేటాయింపును పరిశీలిస్తే జనసేనను ముంచడానికి చంద్రబాబు పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు కనిపిస్తున్నారు. తగినన్ని సీట్లను ఇవ్వకపోవడంతో పాటు జనసేన బలంగా ఉన్న సీట్లలో టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు బరిలోకి దింపుతున్నారు.

First Published:  26 Feb 2024 7:27 AM GMT
Next Story