Telugu Global
Andhra Pradesh

బీజేపీ, బాబు చేసిన పాపాలకు క్షమాపణ చెబుతారా? - మాజీ మంత్రి పేర్ని నాని

ఏపీకి రాష్ట్రానికి బీజేపీ కొత్తగా ఏం న్యాయం చేసిందని ఈ సందర్భంగా పేర్ని నాని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇచ్చిందా? రైల్వే జోన్‌ ఇచ్చిందా? పోర్టు నిర్మాణం పూర్తి చేసిందా? కడప స్టీల్‌ ప్లాంట్‌ కట్టిందా? పోలవరం పూర్తి చేయించి ఇచ్చిందా?

బీజేపీ, బాబు చేసిన పాపాలకు క్షమాపణ చెబుతారా? - మాజీ మంత్రి పేర్ని నాని
X

బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీ వెళ్లి బీజేపీతో చంద్రబాబు చీకటి చర్చలు జరిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో ఏపీ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ అవసరమన్న చంద్రబాబు ఆ పార్టీతో నాలుగేళ్లు చెట్టపట్టాలేసుకుని తిరిగాడని చెప్పారు. ఆ తర్వాత చివరి ఆరు నెలల్లో బీజేపీపై చంద్రబాబు దూషణలకు దిగాడని గుర్తుచేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కూడా తీవ్ర దూషణలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పార్టీతో ఎందుకు కలిసి పోటీ చేయాలనుకున్నాడో ప్రజలకు చెప్పాలని పేర్ని నాని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీకి భార్య లేదన్నాడని, కుటుంబం కూడా లేనోడు నాతో పోటీనా అన్నాడని, ఈడీతో బెదిరిస్తావా.. ఏం చేస్తావో చేసుకో.. అని తేలికచేసి మాట్లాడాడని వివరించారు. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు కోసం ఎందుకు పాకులాడుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

ఏపీకి రాష్ట్రానికి బీజేపీ కొత్తగా ఏం న్యాయం చేసిందని ఈ సందర్భంగా పేర్ని నాని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇచ్చిందా? రైల్వే జోన్‌ ఇచ్చిందా? పోర్టు నిర్మాణం పూర్తి చేసిందా? కడప స్టీల్‌ ప్లాంట్‌ కట్టిందా? పోలవరం పూర్తి చేయించి ఇచ్చిందా? నిర్వాసితులకు ఈ రోజుకీ నయాపైసా ఇవ్వలేదు. ఏపీలో ఒక్క పోర్టు నిర్మాణంలోనైనా సాయం చేశారా? అంటూ పేర్ని నాని నిలదీశారు. గతంలో చంద్రబాబే.. దోసెడు పట్టి... చెంబుడు నీరు ఇచ్చారని ప్రధాని మోదీపై విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా కరుస్తాడని ఆయన ఎద్దేవా చేశారు. ఒంటరిగా జగన్‌ను గెలవలేక పవన్, బీజేపీని తెచ్చుకోవాలని చూస్తున్నాడని, బీజేపీ.. చంద్రబాబు.. తాము చేసిన పాపాలకు ప్రజలకు క్షమాపణ చెబుతారా? అని ఆయన ప్రశ్నించారు. సిగ్గు.. ఎగ్గు లేకుండా జనం మధ్యకు వస్తారా? సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే పేర్ని నాని నిలదీశారు.

First Published:  9 Feb 2024 10:50 AM GMT
Next Story