Telugu Global
Andhra Pradesh

మాట తప్పటం తెలీదట..!

కాపులను బీసీల్లో చేరుస్తానన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం ఇచ్చేంతవరకు నిరుద్యోగులకు రూ. 2 వేల భృతి ఇస్తానన్నారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు. డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు.

మాట తప్పటం తెలీదట..!
X

వినేవాళ్ళు ఏమనుకుంటారో అనే సిగ్గును కూడా చంద్రబాబునాయుడు వదిలేసినట్లున్నారు. చెప్పిన అబద్ధాలు చెప్పటం, ఎవరైనా గుర్తుచేస్తే ఎదురుదాడి చేసి వాళ్ళ నోళ్ళు మూయించటమే చంద్రబాబుకు తెలిసింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ తనకు ఇచ్చిన మాట తప్పటం తెలీదన్నారు. జగన్మోహన్ రెడ్డిలా ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇవ్వటం చేతకాదన్నారు. మాటిస్తే దానిపై నిలబడే వ్యక్తినంటూ తనకు ఏమాత్రం సూట్ కాని లక్షణాలు ఉన్నట్లు పదేపదే చెప్పుకున్నారు.

చంద్రబాబు మాటలు విన్నవాళ్ళకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యుంటుంది. అసలు ఏమాత్రం విశ్వసనీయత లేని, నమ్మదగని వ్యక్తిగా చంద్రబాబు బాగా పాపులర్. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేయటం చంద్రబాబుకు బాగా అలవాటు. కానీ ఇచ్చిన మాటమీద నిలబడే వ్యక్తినని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. పైగా ఆచరణకు సాధ్యంకాని హామీలను జగన్ లాగ ఇవ్వటం తనకు చేతకాదని చెప్పటం విడ్డూరంగా ఉంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చాలా హామీలిచ్చారు. వాటిల్లో కొన్నింటిని పరిశీలించినా చాలు చంద్రబాబు లక్షణం ఏమిటో తెలిసిపోతుంది.

కాపులను బీసీల్లో చేరుస్తానన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం ఇచ్చేంతవరకు నిరుద్యోగులకు రూ. 2 వేల భృతి ఇస్తానన్నారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు. డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు. ఎన్టీఆర్ క్యాంటీన్లని హామీ ఇచ్చారు. మిగిలిన హామీలను వదిలేసినా పైన చెప్పిన వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. రైతు రుణమాఫీ గురించి అడిగితే చేసేశానని బుకాయించారు. బ్యాంకుల్లో ఆడవాళ్ళు కుదవపెట్టిన బంగారాన్ని విడిపించటం సంగతి అడిగితే సమాధానం చెప్పలేదు.

ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతీ లేదు. ఎన్టీఆర్ క్యాంటీన్లను కూడా పెట్టలేదు. డ్వాక్రా రుణాల రద్దు సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నికలు మరో నాలుగు మాసాల్లో ఉందనగా అప్పుడు హడావుడిగా ఎన్టీఆర్ క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి మొదలుపెట్టారు. రుణమాఫీ అరకొరా చేసి వదిలేశారు. డ్వాక్రా మహిళలు ఎదురు తిరుగుతారని భయపడి పోలింగుకు ముందు పసుపు కుంకుమ పేరుతో డబ్బులేశారు. చంద్రబాబు నైజాన్ని గ్రహించిన జనాలు కర్రుకాల్చి వాతలు పెట్టారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతలుకు, మహిళలకు సాయం అంటూ డ్రామాలు మొదలుపెట్టారు. మరి జనాలు నమ్ముతారా..?

First Published:  30 Jan 2024 6:06 AM GMT
Next Story