Telugu Global
Andhra Pradesh

ఇటు జనాలు లేరు.. అటు టీఆర్పీలు రావడం లేదు.. లోకేశ్ పాదయాత్రపై తలబాదుకుంటున్న టీడీపీ!

లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టి 10 రోజులు దాటిపోయింది. ప్రారంభ సభలోనే ఖాళీ కుర్చీలు కనపడ్డాయని టీడీపీ వ్యతిరేక మీడియా, వైసీపీ సోషల్ మీడియా సాక్ష్యాలతో సహా చూపించింది.

ఇటు జనాలు లేరు.. అటు టీఆర్పీలు రావడం లేదు.. లోకేశ్ పాదయాత్రపై తలబాదుకుంటున్న టీడీపీ!
X

ఏపీలో అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీని 2024లో ఎలాగైనా అధికారంలోకి తీసుకొని రావాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు టీడీపీకి పెద్ద పరీక్షగా మారడంతో తన కొడుకు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌తో పాదయాత్ర మొదలు పెట్టించారు. కాగా, గతంలో చంద్రబాబు రాష్ట్రం విడిపోవడానికి ముందు పాదయాత్ర చేసి టీడీపీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. అప్పట్లో వైఎస్ జగన్‌పై ప్రజల్లో సానుభూతి ఉన్నా.. అనుభవం ఉందని ప్రచారం చేసుకోవడంతో చంద్రబాబుకే పట్టం కట్టారు.

అధికారం కోల్పోవడం.. చంద్రబాబు, టీడీపికి కొత్త విషయం కాదు. కానీ, వైఎస్ జగన్ అధికారంలోకి రావడం.. గతంలో ఎన్నడూ చూడని పథకాలను రాష్ట్రంలో అమలు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన గుబులు మొదలైంది. మరోసారి అధికారంలోకి రాలేమేమో అనే దిగులు చంద్రబాబు మదిలో కూడా స్టార్ట్ అయ్యింది. అందుకే వయసురిత్యా ఇప్పుడు సుదీర్గ పాదయాత్రలు చేసేంత ఓపిక లేకపోవడంతో చంద్రబాబు ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు. కానీ టీడీపీ భవిష్యత్ తన కొడుకు లోకేశే అని ప్రొజెక్ట్ చేయాల్సి బాధ్యత ఉన్నందున 'యువగళం' మొదలైంది అని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

చిత్తూరు జిల్లా కుప్పం నుంచే నారా లోకేశ్ 'యువగళం' మొదలైంది. ఇప్పటికే లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టి 10 రోజులు దాటిపోయింది. ప్రారంభ సభలోనే ఖాళీ కుర్చీలు కనపడ్డాయని టీడీపీ వ్యతిరేక మీడియా, వైసీపీ సోషల్ మీడియా సాక్ష్యాలతో సహా చూపించింది. అయితే ఈ ఖాళీ కుర్చీలు అనేవి పెద్దగా ప్రజలపై ఇంపాక్ట్ చూపించవు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు సాక్షి టీవీ సహా ఇతర ఛానల్స్ కూడా లైవ్ అందించాయి. సుదీర్ఘమైన లైవ్ ఇవ్వకపోయినా బహిరంగ సభల్లో మాట్లాడే సమయంలో మాత్రం తప్పకుండా ఐదో పదో నిమిషాలు లైవ్ ఇచ్చేవి.

నారా లోకేశ్ పాదయాత్ర స్టార్ట్ చేయడంతో టీడీపీ అనుకూల మీడియా విస్తృతంగా లైవ్ ఇస్తుందని అనుకున్నారు. మొదటి రెండు రోజులు ఆయా ఛానల్స్, పేపర్స్‌లో బాగానే కవరేజి వచ్చింది. కానీ గత వారం రోజుల నుంచి మాత్రం దాదాపు తగ్గిపోయింది. దీనికి కారణం ఏంటో టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు కూడా అర్థం కావడం లేదు. అయితే అసలు విషయం మాత్రం అంతర్గతంగా టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు.

నారా లోకేశ్ మాట్లాడే విధానం, సబ్జెక్ట్‌పై పట్టు లేకపోవడంతో పాటు పాదయాత్ర, సభల్లో జనాలు పెద్దగా ఉండకపోవడం, ఖాళీ కుర్చీలు కనపడటం టీడీపీకి పైద్ద మైనస్‌గా మారింది. పైగా, లోకేశ్ ఎక్కడైనా మాటామంతీ పెడితే అక్కడ కొంత మంది మహిళలు వైఎస్ జగన్‌ను పొగడటం లైవ్‌లో వెళ్లిపోతోంది. అందుకే టీడీపీ అనుకూల మీడియా సాధ్యమైనంత వరకు లైవ్ ఫీడ్‌ను పక్కన పెట్టేసి.. ఎడిట్ చేసి ప్రసారం చేస్తోందని చర్చించుకుంటున్నారు.

లోకేశ్ పాదయాత్రను ప్రసారం చేసినా.. చూసే వాళ్లు కరువవుతున్నారని.. వాళ్లకు వచ్చే రేటింగ్స్‌లో కూడా అర్థం అవుతున్నది. అందుకే యాత్ర ఆ రోజు ముగిసిన తర్వాత ప్రైమ్ టైంలో ఎడిటెడ్ వీడియోలు పెట్టి వార్తలు ప్రసారం చేస్తున్నారని తెలుస్తున్నది. లైవ్ ప్రసారం చేస్తే లోకేశ్ మాటల్లోని తప్పులను వెదికి వైసీపీ సోషల్ మీడియా రచ్చ చేస్తుందేమో అనే భయం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు మీటింగ్స్‌ను నిరంతరం లైవ్ ఇచ్చే టీడీపీ అనుకూల మీడియా.. నారా లోకేశ్ విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది.

First Published:  5 Feb 2023 9:45 AM GMT
Next Story