Telugu Global
Andhra Pradesh

లోకేష్ యాత్రంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?

ఇప్పుడు ప్రత్యేకంగా లోకేష్ పాదయాత్ర అంటేనే అధికార పార్టీకి పెద్ద జోక్‌గా తయారైంది. పదేపదే లోకేష్ పాదయాత్రపై మాట్లాడుతున్నారంటేనే వీళ్ళు భయపడుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గట్లే పోలీసుల ఓవర్ యాక్షన్ తోడైంది.

లోకేష్ యాత్రంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?
X

లోకేష్ యాత్రంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?

కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. నారా లోకేష్ పాదయాత్ర అంటే అధికార పార్టీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థంకావటంలేదు. మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమ‌ర్నాథ్‌తో పాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. నిజానికి లోకేష్ పాదయాత్ర విషయంలో వీళ్ళింత ఎగతాళిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. లోకేష్ పాదయాత్రపై మంత్రులు, ఎమ్మెల్యేల‌ మైండ్ గేమ్ వర్కవుట్ కూడా కాదు.

రాజకీయ పార్టీ నేతగా, టీడీపీ భావి అధినేతగా పాదయాత్ర చేసే హక్కు, బాధ్యత లోకేష్‌కు ఉంది. అంతమాత్రాన లోకేష్‌ను పప్పు అని, అసమర్థుడ‌ని అభివర్ణించాల్సిన అవసరం లేదు. సాక్షి మీడియా లోకేష్ చేయబోయే పాదయాత్రను అసమర్ధుని జీవన యాత్ర అంటూ ఎద్దేవా చేసింది. గతంలో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, షర్మిల కూడా పాదయాత్రలు చేశారు. అప్పుడు వీళ్ళ పాదయాత్రను ఎవరు ఎద్దేవా చేయలేదు. ప్రత్యర్థి పార్టీలు కూడా ఎగతాళిగా మాట్లాడలేదు.

ఇప్పుడు ప్రత్యేకంగా లోకేష్ పాదయాత్ర అంటేనే అధికార పార్టీకి పెద్ద జోక్‌గా తయారైంది. పదేపదే లోకేష్ పాదయాత్రపై మాట్లాడుతున్నారంటేనే వీళ్ళు భయపడుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గట్లే పోలీసుల ఓవర్ యాక్షన్ తోడైంది. ఉద్దేశ‌పూర్వకంగానే పోలీసులు పాదయాత్రకు అనుమతి ఇవ్వటంలో ఆలస్యం చేయటంతో లోకేష్ పాదయాత్ర అంటే ప్రభుత్వం భయపడుతోందనే సంకేతాలు జనాల్లోకి వెళ్ళిపోయాయి.

పాదయాత్రలో లోకేష్ ఏం మాట్లాడుతారు? ఎలాంటి హామీలిస్తారు? దానికి జనాల స్పందన ఎలాగుంటుందనే విషయాలపై నాలుగు రోజులాగితే క్లారిటి వస్తుంది. కచ్చితంగా పాదయాత్ర సక్సెస్ అయ్యిందని చెప్పుకునేందుకు చంద్రబాబునాయుడు అన్నీ ఏర్పాట్లు చేసుకునే ఉంటారు. మొదటిరోజు నుండి పాదయాత్ర బ్రహ్మాండమని ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మద్దతివ్వాల్సింది మాత్రం జనాలే. పాదయాత్రలో లోకేష్‌తో పాటు పదం కదుపుతున్నది టీడీపీ జనాలా? లేకపోతే మామూలు జనాలా అన్నది తేలిపోతుంది. ఇంతోటిదానికి అధికార పార్టీలో ఇంత ఉలుకెందుకో అర్ధంకావటంలేదు.

First Published:  24 Jan 2023 6:03 AM GMT
Next Story