Telugu Global
Andhra Pradesh

జగన్ 'రాజధాని' స్టేట్‌మెంట్‌పై పెదవి విప్పని చంద్రబాబు.. అసలు వ్యూహం ఏంటి?

టీడీపీకి చెందిన ఒకరిద్దరు నాయకులు మొదట్లో దీనిపై మాట్లాడినా.. తర్వాత సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు వూహాత్మకంగానే దీనిపై మౌనంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

జగన్ రాజధాని స్టేట్‌మెంట్‌పై పెదవి విప్పని చంద్రబాబు.. అసలు వ్యూహం ఏంటి?
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు మూడు రాజధానుల విషయం ఎత్తినా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, ఇతర సీనియర్ నాయకులు అంతెత్తునా లేస్తారు. అమరావతే మా రాజధాని అంటూ కౌంటర్లు ఇస్తారు. వైజాగే మా పరిపాలన రాజధాని అని ఏ వైసీపీ నాయకుడు అన్నా దానికి టీడీపీ నుంచి ఘాటైన రిప్లై వస్తుంది. కాగా, తాజాగా సీఎం జగన్ ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టన్ రైజర్ మీటింగ్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి వైజాగ్ రాజధాని కాబోతోందని, త్వరలో తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతానని స్పష్టం చేశారు.

సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి గట్టి కౌంటరే వస్తుందని అందరూ భావించారు. ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు, పాదయాత్రలో ఉన్న నారా లోకేశ్ ఈ విషయంపై తప్పకుండా విమర్శలు చేస్తారని అనుకున్నారు. వామపక్షాలు, బీజేపీ తప్ప ఎవరూ దీనిపై పెద్దగా రెస్పాండ్ కాలేదు. టీడీపీకి చెందిన ఒకరిద్దరు నాయకులు మొదట్లో దీనిపై మాట్లాడినా.. తర్వాత సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు వూహాత్మకంగానే దీనిపై మౌనంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

మూడు రాజధానుల విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ వారంలోనే దీనికి సంబంధించిన ఒక హియరింగ్ ఉంది. దీనిపై తీర్పు ఇవ్వాల్సింది అత్యున్నత న్యాయస్థానమే. ఇలాంటి సమయంలో వైసీపీ అధినేత జగన్.. విశాఖపట్నమే పరిపాలన రాజధాని అని ప్రకటించి కావాలనే టీడీపీని రెచ్చగొడుతున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ ట్రాప్‌లో చిక్కుకొని.. అమరావతే మా రాజధాని అని కనుక స్టేట్‌మెంట్ ఇస్తే.. మిగిలిన ప్రాంత ప్రజల్లో నెగెటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే టీడీపీ నాయకులను కూడా ఈ స్టేట్మెంట్‌పై మాట్లాడవద్దని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.

ఇంకో ఏడాదిన్నర లోపే ఏపీకి ఎన్నికల జరుగనున్నాయి. ఈ సమయంలో రాజధానుల విషయాన్ని రెచ్చగొట్టి.. తమను అమరావతికే పరిమితం చేయాలని వైసీపీ భావిస్తోందని చంద్రబాబు గ్రహించారు. అసలు రాజధాని అంశాన్ని పెద్దగా హైలైట్ చేయకుండా ముందుకు వెళ్లాలని తెలుగుదేశం నిర్ణయించుకున్నది. అందుకే జనాల్లో తిరుగుతున్న లోకేశ్ కూడా వైఎస్ జగన్ పరిపాలనపై విమర్శలు చేస్తున్నారు తప్ప.. రాజధాని గురించి పల్లెత్తు మాట మాట్లాడటం లేదు.

మరోవైపు వైఎస్ జగన్ ప్రకటనతో వైసీపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. మూడు రాజధానులకు అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తోంది. అందుకే సీఎం అలా ప్రకటన చేశారని కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో చాలా రసవత్తరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.

First Published:  3 Feb 2023 3:16 AM GMT
Next Story