Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యే టికెట్ ఎవరికో?

తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషకు ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. మహిళ, బీసీ, యాదవ, డాక్టర్ అంశాలు శిరీషకు కలిసి వస్తాయనే ప్రచారం బాగా జరుగుతోంది.

ఎమ్మెల్యే టికెట్ ఎవరికో?
X

తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ నుండి రిటైర్ అయిపోయినట్లే. ఎందుకంటే భూమనను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం. ఈయన పదవీకాలం రెండేళ్ళు ఉంటుంది. ఛైర్మన్‌గా జంగా కృష్ణమూర్తి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, డేరంగుల కిరణ్ కుమార్ లాంటి పేర్లు వినిపించినా సడెన్‌గా భూమనకు ఛైర్మన్ పదవి దక్కింది. వారంరోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డిని కలిసి భూమన మాట్లాడటంతోనే ఎమ్మెల్యే పేరు కూడా ఛైర్మన్‌గా తెరపైకివచ్చింది.

సరే ఇప్పుడు ఛైర్మన్ పదవిని ఇచ్చేశారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ టికెట్ దక్కే అవకాశం లేదని సమాచారం. తాను ప్రత్యక్ష రాజకీయాల నుండి రిటైర్ అవుతానని ఎమ్మెల్యే టికెట్ తన కొడుకు అభినయరెడ్డికి ఇవ్వాలని భూమన గతంలోనే రిక్వెస్ట్‌ చేశారు. అయితే అందుకు జగన్ అంగీకరించలేదు. భూమననే కంటిన్యూ అవమని జగన్ చెప్పారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భూమనకు ఛైర్మన్ పదవి ఇవ్వటానికి జగన్ అంగీకరించారు.

ఈ నేపథ్యంలోనే అభినయ్‌కు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ టికెట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారట. ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పరేషన్‌కు అభినయ్ డిప్యూటి మేయర్‌గా ఉన్నారు. అంటే తాజా పరిణామాల ప్రకారం చూస్తే భూమన ఫ్యామిలీకి ఎమ్మెల్యే టికెట్ దక్కటంలేదని అర్థ‌మవుతోంది. మరి ఎమ్మెల్యే టికెట్ ఎవరికి దక్కుతుందనే విషయమై జోరుగా చర్చలు మొదలయ్యాయి.

తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషకు ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. శిరీష్ బీసీ, యాదవ సామాజికవర్గం నేత. మహిళ, బీసీ, యాదవ, డాక్టర్ అంశాలు శిరీషకు కలిసి వస్తాయనే ప్రచారం బాగా జరుగుతోంది. తిరుపతిలో బలిజ, బీసీ, బ్రాహ్మణ, రెడ్డి, ముస్లిం సామాజికవర్గాల ఓట్లు బాగా ఉన్నాయి. కాబట్టి శిరీషకు ఎమ్మెల్యే టికెట్ దక్కేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

First Published:  6 Aug 2023 5:14 AM GMT
Next Story