Telugu Global
Andhra Pradesh

ఈ స్కీమ్స్‌కు చంద్రబాబుకు నిధులేవి.. ఎవరు జవాబు చెప్తారు..?

టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ప్రకటించిన పథకాల అమలుకు ఎంత ఖర్చవుతుందో జగన్‌ ఇటీవలి సిద్ధం సభలో స్పష్టంగా చెప్పారు.

ఈ స్కీమ్స్‌కు చంద్రబాబుకు నిధులేవి.. ఎవరు జవాబు చెప్తారు..?
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలకు సూపర్‌ సిక్స్‌ అని పేరు పెట్టుకున్నారు. వాటికి తోడు మరిన్ని పథకాలను ప్రకటించారు. సంక్షేమ పథకాలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్‌ను శ్రీలంక చేస్తున్నారని ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించారు. బటన్‌ నొక్కి జగన్‌ డబ్బులు పంచుతున్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. ఈనాడు అధినేత రామోజీరావు చంద్రబాబుకు వంత పాడుతున్నారు. చంద్రబాబు ప్రకటించిన పథకాల అమలుకు ఎంత ఖర్చవుతుందని, ఈ నిధులను ఎలా సమకూరుస్తారనే ప్రశ్నలకు రామోజీ గానీ ప్రశాంత్‌ కిశోర్‌ గానీ సమాధానం చెప్పగలరా?

టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ప్రకటించిన పథకాల అమలుకు ఎంత ఖర్చవుతుందో జగన్‌ ఇటీవలి సిద్ధం సభలో స్పష్టంగా చెప్పారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను, ఇతర పథకాలను అమలు చేయడానికి 1.40 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన పథకాలను అమలు చేయడానికి ఎంత ఖర్చవుతుందో లెక్కలు తీయాలని తాను ఆర్థిక శాఖను అడిగినట్లు ఆయన తెలిపారు.

జగన్‌ అమలు చేస్తున్న పథకాల అమలుకు ఏడాదికి అయ్యే ఖర్చు..

1. 55 లక్షల మంది లబ్ధిదారుల పింఛన్లకు రూ.24 వేల కోట్లు

2, రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు రూ.11 వేల కోట్లు

3. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) కింద రేషన్‌ సరఫరాకు రూ.4,600 కోట్లు

4. ఆరోగ్యశ్రీ, ఆసరా, 104, 108 కింద హెల్త్‌కేర్‌కు 4,400 కోట్లు

5. విద్యా దీవెన, వసతి దీవెన కింద ఫీజు రీయంబర్స్‌మెంట్‌ రూ. 5 వేల కోట్లు

6. సంపూర్ణ పోషణ కింద రూ.2,200 కోట్లు

7. గోరు ముద్దకురూ.1,900 కోట్లు

పై పథకాల అమలుకు ఏడాదికి మొత్తం దాదాపు రూ. 52,700 కోట్లు ఖర్చవుతుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ పథకాలను అమలు చేయాల్సిందే. టీడీపీ అధికారంలోకి వచ్చినా వాటిని రద్దు చేయడం కుదరదు.

చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు ఏడాదికి దాదాపు 73,440 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దానికి తోడు బీసీలకు చంద్రబాబు ప్రకటించిన పెన్షన్‌కు అదనంగా 13,872 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. మొత్తం కలిపితే టీడీపీ అధికారంలోకి వస్తే కొత్తగా ప్రకటించిన పథకాలకు రూ.87,312 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం ఏడాదికి 1.4 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మెత్తం ఖర్చు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని జగన్‌ అడిగారు.

పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టి, లంచాలకు తావు లేకుండా చేసి తమ ప్రభుత్వం డిబీటీ, నాన్‌ డిబీటీ ద్వారా రూ.75 వేల ఖర్చుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. చంద్రబాబు చెప్పిన పథకాలను అమలు చేస్తే ఖర్చు రెండిరతలవుతుందని, వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని, చంద్రబాబు చెప్పిన పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

First Published:  12 March 2024 9:58 AM GMT
Next Story