Telugu Global
Andhra Pradesh

అభిమానులే ఎదురుతిరిగారా? ఓటమి నేర్పిన పాఠమేంటి?

గత ఎన్నికలకు ముందు ఎందరో అభిమానులు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక వారిని కనీసం పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది. దీంతో వారు ఈ ఎన్నికలను అస్త్రంగా చేసుకొని వైసీపీని కావాలనే ఓడించారనే టాక్ వినిపిస్తోంది.

అభిమానులే ఎదురుతిరిగారా?  ఓటమి నేర్పిన పాఠమేంటి?
X

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి చుక్కలు చూపించాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో విజయం సాధించిన టీడీపీ.. పశ్చిమ రాయలసీమ స్థానంలోనూ గెలుపు జెండా ఎగరేసేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఈ ఫలితాలపై వైసీపీ పెద్దలు కాస్త అంతర్మథనంలో పడ్డట్టు తెలుస్తోంది. ఫ‌లితాల‌పై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బండిల్స్ కట్టడంలో లోపాలు జరిగి ఉంటాయోమోనని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ స్టేట్‌మెంట్ చాలా మందికి హాస్యాస్పదంగా అనిపించింది.

Advertisement

ఈ ఎన్నికల్లో వైసీపీకి సొంత పార్టీ కార్యకర్తలే దూరమయ్యారనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు ఎందరో అభిమానులు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక వారిని కనీసం పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది. అందరు ప్రజల మాదిరిగానే.. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు తప్ప.. తమ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయడం లేదని.. భావనలో వారు ఉన్నారు. ఈ ఎన్నికలను వారు అస్త్రంగా చేసుకొని.. వైసీపీని కావాలనే ఓడించారనే టాక్ కూడా వినిపిస్తోంది.

Advertisement

వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ పార్టీకి కొంతకాలం ఎదురులేకుండా పోయింది. స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినా.. ఉప ఎన్నికలు జరిగినా.. ఆ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాత్రం బొక్క బోర్లా పడింది. గత ఎన్నికల సమయంలో ఎందరో ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీ కోసం పనిచేశారు. పార్టీలకతీతంగా వారు తమ తమ నియోజకవర్గాల్లో గెలుపు కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేశారు. డబ్బు కూడా ఖర్చు పెట్టారు. మరోవైపు కొందరు నిస్వార్థంగా సోషల్ మీడియాలోనూ వైసీపీ కోసం పనిచేశారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి గుర్తింపు దక్కకపోగా.. పట్టించుకునేవారే కనిపించడం లేదు. మరోవైపు వైసీపీలో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో వివిధ పనులు చేసినవారికి కూడా బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో వీరంతా ప్రస్తుతం వైసీపీపై తిరగబడ్డారనే చర్చ సాగుతోంది.

మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పార్టీలో డమ్మీలుగా మారిపోయారు. పనుల కోసం వారి దగ్గరకు వచ్చే వారే లేకుండాపోయారు. గతంలో ఏ చిన్న పని కోసమైనా ప్రజలు స్థానిక నేతలను కలిస్తే.. వారు ఎమ్మెల్యే, ఎంపీ సాయంతో ఆ పని చేసి పెట్టేవారు. దీంతో ప్రజలతో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు ఓ బాండింగ్ ఏర్పడేది. కానీ ప్రస్తుతం జగన్ వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి.. ఆ వ్యవస్థను కుప్పకూల్చారు. ఇది ప్రజలకు కొంతవరకు మేలు చేసి ఉండొచ్చుగానీ కింది స్థాయి లీడర్లకు విపరీతమైన అసంతృప్తిని మిగిల్చింది. దీంతో ప్రజలకు నాయకులకు మధ్య గ్యాప్ పెరిగింది. ఇవన్నీ వైసీపీ ఓటమికి కారణాలయ్యాయి.

Next Story