Telugu Global
Andhra Pradesh

వైఎస్ జగన్ ధైర్యం ఏంటి? ఆ రిస్క్ ఎందుకు చేస్తున్నారు?

వైఎస్ జగన్ ధైర్యం ఏంటి? ఆ రిస్క్ ఎందుకు చేస్తున్నారు?
X

సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కాబోతున్న మూడు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కర్నూలు-కడప-అనంతపురం నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనుండటంతో ఇప్పటికే వైసీపీ తరపున అభ్యర్థులను ఖరారు చేశారు.

ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయని వైసీపీ.. ఈ సారి ఏకంగా ఎనిమిది నెలల ముందు ఎందుకు అభ్యర్థులను ప్రకటించారో అనే చర్చ జరుగుతోంది. అధికారంలో ఉండే ఏ పార్టీకి అయినా ఐదో ఏడాదిలో కాస్త వ్యతిరేకత మొదలవుతుంది. దీంతో కీలకమైన ఎన్నికల ఏడాదిలో ఎలాంటి ఓటమికి చాన్స్ లేకుండా సిద్ధ‌పడుతుంటుంది. వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ వైఎస్ జగన్ ధైర్యంగా ఒకడుగు ముందుకు వేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగి గెలిస్తే కార్యకర్తల్లోకి పాజిటివ్ సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే వైసీపీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పని చేసే అవకాశాలు కూడా ఉంటాయని అధిష్టానం అనుకుంటోంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పరిమిత సంఖ్యలోనే ఓటర్లు ఉంటారు. ఎక్కువగా అర్బన్ ఏరియాల్లోనే ఓటర్ల నమోదు ఉంటుంది. దీంతో కీలకమైన ప్రాంతాల్లో విద్యావంతుల మూడ్ ఎలా ఉన్నదనే విషయం ఈ ఎన్నికల ద్వారా వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. పొరపాటున ఓడిపోతే అది పార్టీకి నష్టం. అంతే కాకుండా ప్రతిపక్షాలకు కావాలనే ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లు అవుతుంది.

అయినా సరే వైఎస్ జగన్ మాత్రం ఎన్నికల్లో పోటీవైపే మొగ్గు చూపుతున్నారు. ఈ రిస్క్ తీసుకోవడం వల్ల రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగాలో ఒక అంచనాకు రావొచ్చిన ఆయన భావిస్తున్నట్లు తెలుస్తున్నది. వైసీసీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల పరిధిలో ఎన్నికలు జరుగనున్న రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ స్థానికుల మూడ్ ఈ ఎన్నికల ద్వారా తెలుసుకునే వీలుంటుందని వైసీపీ భావిస్తోంది.

జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా ఇప్పటికే నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చారు. మరోవైపు రాబోయే ఎనిమిది నెలల్లో డీఎస్సీతో పాటు మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఇవి తప్పకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి కారణమవుతాయని అధిష్టానం భావిస్తోంది. రిస్క్ అయినా సరే గెలవడం ద్వారా ప్రతిపక్షాలకు కూడా గట్టి సమాధానం చెప్పినట్లు అవుతుందని పార్టీ అంచనాకు వచ్చింది. ఆ ధైర్యంతోనే వైఎస్ జగన్ ఒకడుగు ముందుకు వేసినట్లు తెలుస్తున్నది.

ఎనిమిది నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎలాంటి కంగారు లేకుండా ఇప్పటి నుంచే పని చేసుకునే అవకాశం ఉన్నది. ఓటర్ల నమోదు నుంచి ప్రచారం వరకు అభ్యర్థులకు కావలసినంత సమయం కూడా ఉంది. మరోవైపు అధికారంలో ఉన్న పార్టీకి కొన్ని విధాలుగా అనుకూలతలు కూడా ఉంటాయి. ఇదే ఉద్దేశంతో వైఎస్ జగన్ ధైర్యంగా ఎన్నికలకు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  23 July 2022 4:12 AM GMT
Next Story