Telugu Global
Andhra Pradesh

సీఏఏపై నీ వైఖరి ఏమిటి.. చంద్రబాబూ?

సీఏఏపై ముస్లిం మైనారిటీల్లో తీవ్రమైన ఆందోళన చోటు చేసుకుంది. సీఏఏపై తన వైఖరిని ప్రకటించకుండా చంద్రబాబు ముస్లిం మైనారిటీల్లో చోటు చేసుకున్న ఆందోళనకు ఏ విధంగా సమాధానం చెప్పగలరనేది ప్రశ్న.

సీఏఏపై నీ వైఖరి ఏమిటి.. చంద్రబాబూ?
X

దేశంలో సీఏఏను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. దానికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో పలు పార్టీలు స్పందించాయి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం స్పందించలేదు. బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సీఏఏపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఆయన సీఏఏకు మద్దతు ఇచ్చినట్లే లెక్క.

సీఏఏపై ముస్లిం మైనారిటీల్లో తీవ్రమైన ఆందోళన చోటు చేసుకుంది. సీఏఏపై తన వైఖరిని ప్రకటించకుండా చంద్రబాబు ముస్లిం మైనారిటీల్లో చోటు చేసుకున్న ఆందోళనకు ఏ విధంగా సమాధానం చెప్పగలరనేది ప్రశ్న. వైఎస్‌ జగన్‌పై అనుమానాలు రేకెత్తించే విధంగా టీడీపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు వైఖరి స్పష్టం కాకుండా రాజకీయ ప్రత్యర్థులపై అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రచారం చేయడం కప్పదాటు వ్యవహారం అవుతుంది. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన సమస్యలపై చంద్రబాబు నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం లేదు. తనను నమ్మాలని మాత్రమే చెప్పుతున్నారు. స్పష్టత లేని హామీలను విశ్వసిస్తారని అనుకోవడం పొరపాటే అవుతుంది.

తాము సీఏఏకు వ్యతిరేకమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ ఇటీవల స్పష్టం చేశారు. ఆయన ప్రకటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖండించలేదు. అందువల్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వైఖరి స్పష్టంగా ఉన్నట్లే లెక్క. అయితే, రాజకీయ ప్రత్యర్థులను ప్రశ్నించే ముందు తమ వైఖరి స్పష్టంగా ఉండాలనే ఇంగితం కూడా టీడీపీకి లేదు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం వివిధ సందర్భాల్లో వైఎస్‌ జగన్‌ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వుంటారు. అది అవసరం కూడా. వైఎస్‌ జగన్‌ అంశాలవారీగా మాత్రమే తమకు మద్దతు ఇచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. బేషరతుగా ఆయన బీజేపీకి ఏ రోజు కూడా మద్దతు తెలియజేయలేదు. కానీ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. వివిధ అంశాలపై ఏకాభిప్రాయం ఉంటేనే ఇరు పార్టీల మధ్య పొత్తు సాధ్యమవుతుంది. అంటే, సీఏఏ వైఖరిని చంద్రబాబు సమర్థిస్తున్నారని స్పష్టమవుతోంది.

First Published:  20 March 2024 11:20 AM GMT
Next Story