Telugu Global
Andhra Pradesh

పశ్చిమ రాయలసీమ కూడా టీడీపీకే.. కోర్టుకెళ్తామన్న వైసీపీ

పశ్చిమ రాయలసీమ టీచర్ల నియోజకవర్గం వైసీపీకి దక్కగా, పట్టభద్రుల స్థానం టీడీపీ వశమైంది. మొత్తం 49మంది అభ్యర్థులు పోటీ పడగా భూమిరెడ్డి రామగోపాల రెడ్డి విజయం సాధించారు.

పశ్చిమ రాయలసీమ కూడా టీడీపీకే.. కోర్టుకెళ్తామన్న వైసీపీ
X

మూడు స్థానాల్లోనూ పట్టభద్రులు టీడీపీవైపే నిలిచారు. ఇప్పటికే తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర రిజల్ట్స్ రాగా, ఉత్కంఠగా జరిగిన పశ్చిమ రాయలసీమ పోరులో కూడా టీడీపీ గెలిచింది. ప్రతి రౌండ్ లోనూ హోరాహోరీగా పోరు సాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోయే సరికి, ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి గెలుపొందారు.


పశ్చిమ రాయలసీమ టీచర్ల నియోజకవర్గం వైసీపీకి దక్కగా, పట్టభద్రుల స్థానం టీడీపీ వశమైంది. మొత్తం 49మంది అభ్యర్థులు పోటీ పడగా భూమిరెడ్డి రామగోపాల రెడ్డి విజయం సాధించారు. భూమిరెడ్డికి 1,09,781 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయి. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శనివారం రాత్రి 8గంటల వరకు కొనసాగింది.

కోర్టుకెళ్తామంటున్న వైసీపీ..

ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రీ కౌంటింగ్‌ కి డిమాండ్‌ చేస్తూ కౌంటింగ్‌ కేంద్రంలో కింద కూర్చుని అభ్యర్థి రవీంద్రారెడ్డితోపాటు మరికొందరు నేతలు నిరసన తెలిపారు. కలెక్టర్‌ జోక్యంతో ఆందోళన విరమించిన రవీంద్రారెడ్డి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. కోర్టుకి కూడా వెళ్తామని హెచ్చరించారు.

టీడీపీలో జోష్..

మూడో సీటు కూడా టీడీపీ వశం కావడంతో ఆ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. అనంతపురం జిల్లాల్లో మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి.

First Published:  18 March 2023 3:48 PM GMT
Next Story