Telugu Global
Andhra Pradesh

టీడీపీతోనే పోదాం.. పవన్‌కు నాదెండ్ల సలహా?

వైసీపీ విముక్త ఏపీని చేయాలని పవన్ కల్యాణ్ ఆశిస్తున్నారు. బీజేపీ అధినాయకత్వానికి మాత్రం ఆ దిశగా ఎలాంటి ఆసక్తి లేనట్లు తెలుస్తున్నది.

టీడీపీతోనే పోదాం.. పవన్‌కు నాదెండ్ల సలహా?
X

వైజాగ్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ కల్యాణ్ భేటీ తర్వాత జనసేన పార్టీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. జనసేనతో బీజేపీ, టీడీపీని కలుపుకొని పోయి అధికార వైసీపీని గద్దె దించాలనే ఆలోచనతో ఉన్న పవన్ కల్యాణ్ ఆశలపై మోడీ నీళ్లు చల్లారు. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి ప్రధాని మోడీ విముఖత చూపడంతో ఇప్పుడు జనసేనను ఏ రాజకీయ కోణంలో నడిపించాలనే సందిగ్దంలో పీకే ఉన్నట్లు తెలుస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబుతో చాలా సన్నిహిత సంబంధాలు నడపించిన పవన్ కల్యాణ్‌కు బీజేపీ అధిష్టానం ఇచ్చిన షాక్‌తో ఏం చేయాలో పాలుపోవడం లేదు.

వైసీపీ విముక్త ఏపీని చేయాలని పవన్ కల్యాణ్ ఆశిస్తున్నారు. బీజేపీ అధినాయకత్వానికి మాత్రం ఆ దిశగా ఎలాంటి ఆసక్తి లేనట్లు తెలుస్తున్నది. ఇప్పటికిప్పుడు వైసీపీ ప్రభుత్వంతో వైరం పెట్టుకునే ఉద్దేశం కూడా బీజేపీకి లేదు. అందుకే రాష్ట్ర బీజేపీ నాయకులు వైసీపీపై ఎన్ని విమర్శలు చేస్తున్నా.. జాతీయ నాయకులు మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బీజేపీతో వెళ్లడం ఇక కష్టమేనని జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భావిస్తున్నారు. ఒంటరిగా లేదా టీడీపీతో కలసి.. వచ్చే ఎన్నికలకు వెళ్దాం అని పవన్ కల్యాణ్‌కు సలహా ఇచ్చినట్లు తెలుస్తున్నది.

కాగా, పవన్ కల్యాణ్‌కు ఇటు బీజేపీని, అటు టీడీపీని వదులుకోవడం ఇష్టం లేదు. జనసేన, టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేస్తేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ దూకుడును చూస్తుంటే మూడు పార్టీలు కలిసి ఎదుర్కోవల్సిందేనని పీకే వాదిస్తున్నారు. అయితే, నాదెండ్ల మాత్రం అది ఏ మాత్రం కుదరని పని అని తేల్చేసినట్లు సమాచారం. బీజేపీ అధిష్టానం కచ్చితంగా టీడీపీతో జత కట్టడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు మనం బీజేపీతో వెళ్లినా.. తగినంత ప్రాధాన్యత లభించకపోవచ్చు. టీడీపీ అయితే కాస్త బెటర్ అని నాదెండ్ల.. పవన్‌ను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తున్నది. 2029 నాటికి చంద్రబాబు నాయుడి వయసు కూడా 80 ఏళ్లకు చేరుకుంటుంది. అప్పుడు జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ సీనియర్ నాయకుడిగా మారే అవకాశం ఉంటుందని చెప్పినట్లు చర్చ జరుగుతోంది.

అవసరం అయితే ఈ సారికి ఒంటరిగా అయినా ఎన్నికలకు వెళ్దాము. టీడీపీతో కలిసినా ఓకే కానీ.. బీజేపీతో మాత్రం వద్దని నాదెండ్ల పీకేకు చెబుతున్నారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విభేదిస్తే రాజకీయంగా సమస్యలు ఎదురవుతాయని పవన్ ఆందోళన చెందుతున్నారు. ఎలాగో జనసేనకు అండగా ఉంటామని మోడీ హామీ ఇచ్చారు. అలాంటి సమయంలో ఆయనను కాదని టీడీపీతో వెళ్తే లేనిపోని చిక్కులు ఎదురవుతాయేమో అని పీకే ఆలోచిస్తున్నారు. టీడీపీతో పూర్తి స్థాయిలో పొత్తు పెట్టుకుంటే.. భవిష్యత్‌లో చంద్రబాబు తనను ఎదగనిస్తాడా లేదా అనే భయం కూడా పవన్‌కు ఉన్నది. ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి రాజకీయాలకు సిద్ధం అవుతున్న పీకేకు.. ఇప్పుడు ఏ పార్టీతో వెళ్లాలనే ఆయోమయం వెంటాడుతున్నది.

ఒక పార్టీని కాదని మరొక పార్టీతో వెళ్లినా తనకు భవిష్యత్‌తో తప్పకుండా చిక్కులు ఎదురవుతాయని భావిస్తున్నారు. బీజేపీని వదిలేస్తే.. రాజకీయంగా ఇబ్బంది పెట్టవచ్చు. అలా కాకుండా టీడీపీని వదిలేస్తే.. ఆ పార్టీ అనుకూల మీడియా తనను పెద్ద విలన్‌లాగా చిత్రించే అవకాశం ఉన్నది. అందుకే ఎన్నికల వరకు పొత్తులపై చర్చలు వద్దనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అప్పటి వరకు తన రాజకీయాలు తాను చేసుకుంటానని కూడా నాదెండ్లకు చెప్పినట్లు సమాచారం. మొత్తానికి వైజాగ్‌లో ప్రధానితో భేటీ తర్వాత పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా పెద్ద చిక్కే వచ్చిందనే చర్చ జరుగుతోంది.

First Published:  22 Nov 2022 12:22 PM GMT
Next Story