Telugu Global
Andhra Pradesh

కోటంరెడ్డి మెడలో గంటకట్టారా?

పార్టీలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తనతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని కోటంరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. కోటంరెడ్డితో టచ్‌లో ఉన్నది ఎవరనే విషయం ఈనెల 13 తర్వాత బయటపడుతుందేమో చూడాలి.

కోటంరెడ్డి మెడలో గంటకట్టారా?
X

కొద్ది రోజులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తీరు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీలో బయటపడని అసంతృప్తులు ఇంకా ఉన్నారని వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాతే కోటంరెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. పార్టీలో అసంతృప్తుల విషయంపై క్లారిటి రావాలంటే ఈనెల 13వ తేదీ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంద‌ని అనుకుంటున్నారు. ఎందుకంటే గడపగడపకు మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమం చివరి వర్క్ షాప్ 13వ తేదీన జరగబోతోంది.

ఆ వర్క్ షాపులో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే వివరాలను జగన్ వినిపిస్తారు. గడచిన మూడు వర్క్ షాపుల్లో జగన్ ఇలాగే చేశారు. తాను ఎంతో ప్రిస్టేజిగా తీసుకున్న గడపగడపకు మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేల మీద ఫుల్‌గా ఫైరయ్యారు. కార్యక్రమంలో ఎవరెవరు సక్రమంగా పాల్గొనటంలేదన్న విషయాన్నిపేర్లు ప్రస్తావించి మరీ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే విధానం మీదే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయిస్తానని జగన్ ఇదివరకే చెప్పారు.

వచ్చే వర్క్ షాపే చివరది కాబట్టి టికెట్లు దక్కే విషయంలో ఎమ్మెల్యేల‌కే క్లారిటి వచ్చేస్తుంది. టికెట్ల విషయంలో జగన్ పైకి చెప్పకపోయినా ఎవరికి వాళ్ళకే విషయం అర్థ‌మైపోతుంది. టికెట్లు రావని ఖాయమైన ఎమ్మెల్యేలు అప్పుడు ఏం చేస్తారు? అన్నదే అసలైన పాయింట్. ఇలాంటి వాళ్ళే కోటంరెడ్డి మెడలో గంట కట్టారనే ప్రచారం పెరిగిపోతోంది. వర్క్ షాప్ దాకా అవసరం లేదని తమకు టికెట్లు దక్కే విషయంలో ఆనం రామనారాయణరెడ్డి లాంటి మరికొందరికి ఇప్పటికే క్లారిటి వచ్చేసిందనే ప్రచారం పెరిగిపోతోంది.

కాబ‌ట్టి, 13వ తేదీ తర్వాత కోటంరెడ్డితో కలిసేదెవరు అనే విషయమై క్లారిటి వచ్చే అవకాశముంది. ఇలాంటి వాళ్ళంతా కలిసి పార్టీని వదిలేస్తారా? లేకపోతే పార్టీలోనే ఉంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఆనం లాగ ప్రభుత్వాన్ని గబ్బు పట్టించే ప్రయత్నాలు చేస్తారా అనే చర్చలు పెరిగిపోతున్నాయి. పార్టీలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తనతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని కోటంరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. కోటంరెడ్డితో టచ్‌లో ఉన్నది ఎవరనే విషయం 13 తర్వాత బయటపడుతుందేమో చూడాలి.

First Published:  10 Feb 2023 6:41 AM GMT
Next Story