Telugu Global
Andhra Pradesh

ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోము.. అభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం : సజ్జల

ఉద్యోగులను సంఘంగా చేసి ఆర్గనైజ్ చెయ్యాలనే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. సీఎం జగన్ దృష్టిలో ఉద్యోగులందరూ సమానమే అని చెప్పారు.

ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోము.. అభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం : సజ్జల
X

ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోబోమని, సమాజం అభివృద్ధి సాధించడంలో భాగస్వాములను చేస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాలతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఉన్న సమస్యలు, ఇతర విషయాలపై వారితో చర్చించారు. గతంలో ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లడానికి ఉద్యోగ సంఘ నాయకులే ప్రయత్నించారు. గత ప్రభుత్వాలు కూడా వారిని వాడుకోవాలనే ధోరణిలోనే ఉండేవని సజ్జల అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

ఉద్యోగులను సంఘంగా చేసి ఆర్గనైజ్ చెయ్యాలనే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. సీఎం జగన్ దృష్టిలో ఉద్యోగులందరూ సమానమే అని చెప్పారు. ఉద్యోగులకు రాజకీయాలు అవసరం లేదని, పథకాల అమలు చేయడంలో మంచి ఫలితాలు రావాలంటే ఉద్యోగుల పాత్ర ముఖ్యమని సీఎం చెప్పినట్లు సజ్జల వెల్లడించారు. మాకు కొంత మంది ఉద్యోగ సంఘ నేతలతో పరిచయం కూడా లేదు. ఇక వారిని రాజకీయంగా ఎలా వాడుకుంటామని సజ్జల ప్రశ్నించారు.

సమాజం మొత్తాన్ని మరింత మెరుగైన స్థితికి తీసుకొని వెళ్లాలని సీఎం కృషి చేస్తున్నారు. ఈ సమాజం అభివృద్ధికి ఉద్యోగల పాత్ర ముఖ్యం. అందుకే వారిని భాగస్వాములను చేస్తున్నామని అన్నారు. ఉద్యోగులకు ఏమైనా చేయలేకపోతే మా నిస్సహాయతను ముందే చెప్తున్నామని.. ఉద్యోగులు గ్రూపులు కట్టడం అనవసరం అని సజ్జల సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వాములు అయితే, సమాజ సేవ చేస్తున్న తృప్తి కూడా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధిలో కీలకంగా ఉండాలనేదే సీఎం జగన్ అభిప్రాయమని సజ్జల అన్నారు.

పీఆర్సీపై అప్పట్లో ఒక సైడ్ తీసుకున్న మాట వాస్తవమే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా వరకు ఉద్యోగులందరూ సమానమే అని సజ్జల చెప్పారు. సంస్కరణలు చివరి వరకు వెళ్లాలంటే ఉద్యోగులు తప్పకుండా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఉద్యోగుల్లో గొడవలు పెట్టొద్దని, అవసరం అయితే వారితో చర్చించి, బుజ్జగించి పని చేయించుకుందామని అన్నారు. అసంఘటిత ఉద్యోగులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

First Published:  17 Nov 2022 12:58 PM GMT
Next Story