Telugu Global
Andhra Pradesh

ఇదేం ఖ‌ర్మ శ్రీకాకుళం తెలుగుదేశానికి.. త‌న్నుకున్న త‌మ్ముళ్లు.. పోలీస్‌ కేసులు

టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి గుండ‌ లక్ష్మీదేవి, ఆమె భర్త, మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ త‌మ‌పైకి దాడుల‌కు మ‌నుషుల్ని పంపుతున్నార‌ని, త‌మ‌కు ప్రాణ‌ హాని ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

ఇదేం ఖ‌ర్మ శ్రీకాకుళం తెలుగుదేశానికి.. త‌న్నుకున్న త‌మ్ముళ్లు.. పోలీస్‌ కేసులు
X

వైసీపీ పాల‌న‌కు వ్య‌తిరేకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర‌వ్యాప్తంగా `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి` అనే కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంది. శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ నాయ‌కులు ఇరువ‌ర్గాలుగా విడిపోయారు. గొడ‌వ‌లు ప‌డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. దీంతో ఇదేం ఖ‌ర్మ శ్రీకాకుళం తెలుగుదేశానికి అని ఆ పార్టీ కేడ‌ర్ తీవ్ర ఆందోళ‌నలో ఉంది. నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే గుండ ల‌క్ష్మీదేవి వ‌ర్గానికి, గొండు శంక‌ర్ వ‌ర్గానికి మ‌ధ్య విభేదాలు తీవ్రమ‌య్యాయి. సీటు కోసం పోటీప‌డుతున్న శంక‌ర్, గుండ ల‌క్ష్మీ కుటుంబానికి స‌మాంత‌రంగా పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాడు. త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని మెయింటెన్ చేస్తున్నాడు.

టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేర‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అంపోలులో `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి` కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌కుండా టీడీపీ నేత‌లే అడ్డుకుంటున్నార‌ని గుండ లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంపోలు గ్రామంలో కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డానికి త‌న అనుమ‌తి ఉండాల‌ని గొండు శంక‌ర్ వ‌ర్గానికి చెందిన టీడీపీ నేత‌ గొండు అచ్యుతరావు తేల్చేశారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జి ల‌క్ష్మీదేవి టీడీపీలోని మ‌రో వ‌ర్గంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుకు కౌంట‌ర్ గా త‌మ‌ను చంప‌డానికి గుండ లక్ష్మీదేవి అనుచరుడు వెలమల శ్రీనివాస్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మాజీ మంత్రి గుండ‌ అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవిలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. త‌న‌ను చంపుతానంటూ బెదిరించిన ఆడియోల‌ను పోలీసుల‌కు అంద‌జేశాడు.

టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి గుండ‌ లక్ష్మీదేవి, ఆమె భర్త, మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ త‌మ‌పైకి దాడుల‌కు మ‌నుషుల్ని పంపుతున్నార‌ని, త‌మ‌కు ప్రాణ‌ హాని ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. వాస్త‌వంగా అస‌లు గొడ‌వ శ్రీకాకుళం టీడీపీ టికెట్ అనేది అంద‌రికీ తెలిసిన విష‌యం. వచ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కి టికెట్లు అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డంతో మాజీ ఎంపీపీ త‌న‌యుడైన గొండు శంక‌ర్ తాను టికెట్ రేసులో ఉన్నానంటూ ప్ర‌చారం చేసుకుంటున్నాడు. ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడికి మేన‌ల్లుడిన‌ని కూడా చెప్పుకుంటున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. త‌న‌కు ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని ఈసారి శ్రీకాకుళం సీటు త‌న‌దేన‌ని ప్ర‌చారం చేసుకోవ‌డంతో గుండ ల‌క్ష్మీదేవి దంప‌తులు ఆ వ‌ర్గాన్ని దూరం పెడుతూ వ‌చ్చారు. చివ‌రికి సీటు పోటీ తెలుగు త‌మ్ముళ్ల‌ని ప‌ర‌స్ప‌ర కేసుల‌తో పోలీసు స్టేష‌న్ మెట్లెక్కించింది.

First Published:  13 Jan 2023 3:13 PM GMT
Next Story