Telugu Global
Andhra Pradesh

ఓటుకు లోను ఆఫర్.. బ్యాంకు ముందు భారీ క్యూ

బ్యాంకు చైర్మన్‌గా సదరు ఎమ్మెల్యే అభ్యర్థి భార్యే ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని లోన్లు తీసుకోండి.. ఓటు నాకేయండే ఆఫర్ మొదలు పెట్టాడు.

ఓటుకు లోను ఆఫర్.. బ్యాంకు ముందు భారీ క్యూ
X

ఓటుకు నోట్లు ఇవ్వడం.. బహుమతులు ఇవ్వడం కామన్. పోలింగ్ ముందు రోజు మద్యం, మాంసం పార్టీలు కూడా సాధారణమే. కానీ ఇక్కడ ఒక పార్టీ ఆశావహుడు ఏకంగా లోన్లు ఇప్పిస్తానని చెప్పేశాడు. అంతే కాదు ఆ లోన్లు తిరిగి కట్టనవసరం లేదని కూడా బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అసలు ఎన్నికల ఊసేలేని ఆంధ్రప్రదేశ్‌లో ఈ చోద్యం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే..

ఏపీలోని కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత ఎప్పటి నుంచో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ సారి తనకు టికెట్ ఖాయమని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో నాకే టికెట్.. మీరంతా నాకే ఓటేయాలి.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో లోన్లు నేను ఇప్పిస్తా.. అందరూ తీసుకోండి. లోన్లు తిరిగి చెల్లించకపోయినా పర్వాలేదని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే బ్యాంకుకు అతడికి ఏంటి సంబంధం అనే డౌట్ వచ్చిందా? ఆ బ్యాంకు చైర్మన్‌గా సదరు ఎమ్మెల్యే అభ్యర్థి భార్యే ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని లోన్లు తీసుకోండి.. ఓటు నాకేయండే ఆఫర్ మొదలు పెట్టాడు.

సదరు నాయకుడు ఇలా చెప్పడంతో జనాలు కర్నూలులోని జిల్లా సహకార బ్యాంకు ముందు క్యూ కట్టారు. ఈ బ్యాంకులో వ్యక్తిగత రుణాల కంటే గ్రూపులకే ఎక్కువగా లోన్లు మంజూరు చేస్తారు. ఎవరైనా నలుగురు గ్రూపుగా కలిసి లోనుకు దరఖాస్తు పెట్టుకుంటే కనీసం రూ.1 లక్ష లోను వస్తుంది. దీంతో ఇడ్లీ బండీ, పూల దుకాణం, ఆటో డ్రైవర్లు, కూలీలు నలుగురి చొప్పున గ్రూపుగా ఏర్పడి లోన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. బ్యాంకుకు ఒక్కసారిగా తాకిడి పెరగడంతో అక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లోన్ వస్తే వచ్చింది లేకపోతే లేదు.. ముందైతే ఒక అకౌంట్ ఓపెన్ చేసి.. అప్లికేషన్ పెట్టుకుందామని వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు.

కాగా, ఈ విషయం తెలిసి ప్రతపక్షాలతో పాటు సొంత పార్టీ వాళ్లు కూడా సదరు నేతపై మండిపడుతున్నారు. ప్రభుత్వ సహకార బ్యాంకును ఎన్నికల్లో తాయిలాల కోసం వాడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా ఓట్లు దండుకోవాలని అధికార పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు కర్నూలు నియోజకవర్గంలో 4 వేల గ్రూపులకు రూ.40 కోట్ల రుణాలు ఇవ్వాలని ఇప్పటికే సదరు నేత బ్యాంకు అధికారులకు చెప్పినట్లు తెలుస్తున్నది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని ప్రతీ వార్డులో ఉన్న వారికి లోన్లు వచ్చేలా ఇప్పటికే సదరు నాయకుడి అనుచరులు పత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. మరో వైపు ఈ పరిణామంపై బ్యాంకు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రూపుల వారికి రూ.30 కోట్ల మేర రుణాలు మంజూరు చేశారు. అవన్నీ సకాలంలో వసూలు కాకపోవడంతో బ్యాంకు నష్టాల్లో కూరుకొని పోయింది.

వాస్తవానికి రైతులకే ఎక్కువగా రుణాలను సదరు సహకార బ్యాంకు మంజూరు చేయాల్సి ఉండగా.. ఇప్పుడు ఇలా చిరు వ్యాపారులకు రుణాలివ్వాలని చెప్పడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. రైతులు రుణాలు చెల్లించకపోయినా.. ప్రభుత్వాలు రుణమాఫీ చేసినప్పుడైనా ఆ డబ్బు తిరిగి బ్యాంకుకు చేరుతుంది. కానీ ఇప్పుడు చిరు వ్యాపారులకు ఇచ్చిన డబ్బును కచ్చితంగా వసూలు చేసుకోవల్సిందే. వాళ్లు చెల్లించకపోతే భారీ నష్టాలు తప్పవని అధికారులు అంటున్నారు.

First Published:  5 Oct 2023 4:01 AM GMT
Next Story