Telugu Global
Andhra Pradesh

ఆస్తులను వెల్లడించిన ఏపీ సమాచార చీఫ్ కమిషనర్ ఆర్.ఎం.బాష

ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ (ఏపీఐసీ) (సమాచార హక్కు చట్టం2005) చీఫ్ కమిషనర్ ఆర్.మహబూబ్ బాష తన ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించారు.

ఏపీ సమాచార చీఫ్ కమిషనర్ ఆర్.ఎం.బాష
X

ఏపీ సమాచార చీఫ్ కమిషనర్ ఆర్.ఎం.బాష

ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ (ఏపీఐసీ) (సమాచార హక్కు చట్టం2005) చీఫ్ కమిషనర్ ఆర్.మహబూబ్ బాష తన ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల సమాచార కమిషన్ల చరిత్రలో ఒక చీఫ్ కమిషనర్ లేదా ఒక కమిషనర్ తన ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించడం ఇదే తొలిసారి.

కేంద్రంలోని కేంద్ర సమాచార కమిషలోని చీఫ్ కమిషనర్, ఇతర సమాచార కమిషనర్లు తమ ఆస్తులను వెల్లడించి ఆదర్శంగా నిలిచారు. అలాగే కేరళ రాష్ట్రాల సమాచార కమిషనర్లు, చీఫ్ కమిషనర్ తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణాదిలో ఏపీ చీఫ్ కమిషనర్ బాషా కూడా తన ఆస్తులను తనంతట తానుగా వెల్లడించడమే కాక వాటిని ఏపీఐసీ అధికారిక వెబ్ సైట్లో ప్రజలందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచారు.

ఆయన తన భార్య ఆర్ .జరీనా బేగం అనుమతితో ఆమె తాలూకు ఆస్తుల వివరాలను కూడా వెల్లడించారు. పారదర్శకతకు ప్రతీకగా, భారత పౌరులకు సమాచారం ఇప్పించే సమాచార కమిషన్ కు అధ్వర్యం వహిస్తున్న తాను ఆస్తులను వెల్లడించడం ద్వారా ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చినట్లు అయింది.

భారత సుప్రీంకోర్టు, పలు హైకోర్టులకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల ఆస్తులను వెల్లడించే సంప్రదాయం మన దేశంలో ఉంది. అదే ఒరవడిలో క్వాసీ జ్యుడిషియల్ సంస్థ అయిన సమాచార కమిషన్ లో కమిషనర్లుగా ఉండేవారు సైతం ప్రకటించాలనే ఉద్దేశ్యంతో ఆర్.ఎం.బాష తన ఆస్తులను వెల్లడిస్తూ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఏపీ కమిషన్లో పని చేసే ఇతర సహ కమిషనర్లు కూడా ఐచ్ఛికంగా తమ ఆస్తులను వెల్లడించి పారదర్శకతను నెలకొల్పాలని ఆయన సూచించారు.

వాస్తవానికి విశాఖపట్టణం వాసి అయిన రిటైర్డు సీనియర్ అధికారి ఇ.ఏ.ఎస్ శర్మ సమాచార కమిషనర్లు తమ ఆస్తులను వెల్లడించాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రజా జీవితంలో క్రియాశీలంగా వ్యవహరించే శర్మ ఇదే విషయమై మునుపటి ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ప్రస్తుత గవర్నర్ సయ్యద్ నజీర్ లకు పలు మార్లు లేఖలు రాశారు. దాని పర్యవసానంగానే ఒక సానుకూల దృక్పథంతో బాషా గోప్యతకు తావు లేకుండా తన ఆస్తులను ప్రకటించారు.

ఆస్తుల వివరాలు

సొంత ఊరు అయిన ప్రొద్దుటూరులో పూర్వీకుల నుంచి సంక్రమించిన 60 గజాల పాత ఇల్లు (విలువ రూ 1932000లు)

వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో 351 చ.గ స్థలము (విలువ రూ403650లు) అదే ఊరు లో తన భార్య జరీనా బేగం పేరిట రూ 201250లు విలువ చేసే 175 చ.గ.ల స్థలం. తన పేరిట ఇండియన్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో రు 25000లు, యూనియన్ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో రూ 430000లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ ఖాతా (సాలరీ అకౌంట్)లో రూ 11,42000లు, తన భార్య పేరిట సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో రూ 3024.15లు, తన పేరిట పోస్టాఫీసు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ ఖాతాలో రూ 156000లు, జాతీయ పింఛను పథకంలో రూ 19,170లు, కొటక్ అస్యూర్డ్ ఇన్ కమ్ స్కీంలో (నాన్ పార్టిసిపేటింగ్ యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ ప్లాన్లో రూ 2,19,421లు, తన భార్య పేరిట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ 2 లక్షలు (వివిధ బాండ్లు), తన భార్య జరీనా వద్ద 30 తులాల బంగారం, 4 తులాల వెండి ఉన్నట్లు వెల్లడించారు. ఇవి కాక 2002లో కొనుగోలు చేసిన హీరో హోండా సీడీ డాన్ టూ వీలర్, 2008లో కొనుగోలు చేసిన మరో హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ టూ వీలర్ ఉన్నాయి. ఇక ప్రతి నెలా ఆదాయపు పన్ను మినహాయింపులు పోను రూ. 341050ల జీతం లభిస్తుందని తన ఆస్తుల వివరాల్లో బాషా పేర్కొన్నారు.

First Published:  29 May 2023 11:50 AM GMT
Next Story