Telugu Global
Andhra Pradesh

విశాఖ ఒక్కటే ఏపీకి రాజధాని.. బుగ్గన రాజేసిన మంట

“ఏపీకి తదుపరి రాజధానిగా విశాఖను మా ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న సమాచారం పూర్తిగా అవాస్తవం.”అని ఆయన బెంగళూరులో చెప్పిన మాటలు ఇక్కడ ఏపీలో మంటలు రాజేశాయి.

విశాఖ ఒక్కటే ఏపీకి రాజధాని.. బుగ్గన రాజేసిన మంట
X

మూడు రాజధానుల విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా...? ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాటలు వింటే అదే నిజమనిపిస్తోంది. ఇన్నాళ్లూ మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పుకుంటూ వస్తున్న వైసీపీ.. ఇప్పుడు విశాఖ ఒక్కటే రాజధాని అంటోంది. బుగ్గన వ్యాఖ్యల సారాంశం అదే. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసినా, సమయం, సందర్భం ఏదయినా.. “ఏపీకి తదుపరి రాజధానిగా విశాఖను మా ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న సమాచారం పూర్తిగా అవాస్తవం.”అని ఆయన బెంగళూరులో చెప్పిన మాటలు ఇక్కడ ఏపీలో మంటలు రాజేశాయి.

ఏపీకి అమరావతి ఏకైక రాజధాని కాదు అని వైసీపీ అంటోంది, అదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణకోసం మూడు రాజధానులు చేస్తామంటున్నారు. రాయలసీమకు హైకోర్టు ఇచ్చేశామన్నారు. దానికి తగిన ఏర్పాట్లు జరగడంలేదు. భవిష్యత్తులో అమరావతి నుంచి హైకోర్టు కర్నూలుకి తరలి వెళ్తుందన్న ఆశలు కూడా ఎవరికీ లేవు, కేవలం ఓ బెంచ్ ఇచ్చి సరిపెడతారనే అనుమానాలున్నాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ బుగ్గన మాట్లాడారు. అక్కడ హైకోర్టు ప్రిన్సిపల్‌ బెంచ్‌ మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఇక విశాఖే ఏపీకి అసలైన రాజధాని అన్నారు.

సీఎం ఎక్కడ ఉంటే రాజధాని అదే. ఆ లెక్కన విశాఖలో సచివాలయం ఉంటుంది కాబట్టి, సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అదే అసలైన రాజధాని అనుకోవాలి. కానీ పదే పదే వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో కోర్టులకు చెప్పింది మాత్రం వేరే. అమరావతి నుంచి రాజధానిని తరలించడంలేదు, అసెంబ్లీ అక్కడే ఉంటుందని అన్నారు. కానీ బుగ్గన తాజాగా గుంటూరులో ఒక సెషన్ సమావేశాలు మాత్రమే జరుగుతాయని ముక్తాయించారు.

సామాన్యులకు అక్కర్లేదు, కానీ..!

వైసీపీ మూడు రాజధానులు విషయంలో సామాన్య ప్రజలకు పెద్దగా బాదరబందీ లేదనే విషయం గతంలోనే తేలిపోయింది. నిజంగానే ఏపీ ప్రజలకు అమరావతితో బాండింగ్ ఉంటే కచ్చితంగా ఆ ప్రభావం స్థానిక ఎన్నికల్లో కనపడేది. కానీ అమరావతి ప్రాంతంలో కూడా వైసీపీయే క్లీన్ స్వీప్ చేసింది. ఓట్లు, సీట్ల సంగతి ఎలా ఉన్నా.. రాజధాని విషయంలో ఏపీలో ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తోంది. కనీసం మాటలతో అయినా, చేతలతో అయినా ఈ వివాదానికి త్వరలో ప్రభుత్వం ముగింపు పలికితే మంచిది.

First Published:  15 Feb 2023 1:24 AM GMT
Next Story