Telugu Global
Andhra Pradesh

మరోసారి తెరపైకి విశాఖ.. జి-20 సదస్సుకోసం ముస్తాబు

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తర్వాత ఇప్పుడు మరోసారి విశాఖ పేరు హైలెట్ కాబోతోంది. ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఆతిథ్యమిస్తూ జి-20 సదస్సుకి విశాఖ ఆహ్వానం పలుకుతోంది.

మరోసారి తెరపైకి విశాఖ.. జి-20 సదస్సుకోసం ముస్తాబు
X

ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో విశాఖ పట్నంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించింది. రెండురోజులపాటు అందరి దృష్టీ విశాఖపైనే ఉంది. అయితే ఆ కార్యక్రమంతో వైసీపీకి మైలేజీ పెరిగిందా, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో అది ప్రతిఫలించిందా అనేది వేరే విషయం. అయితే ఇప్పుడు మరోసారి విశాఖ పేరు హైలెట్ కాబోతోంది. ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఆతిథ్యమిస్తూ జి-20 సదస్సుకి విశాఖ ఆహ్వానం పలుకుతోంది.

ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే జి–20 సదస్సు ద్వారా విశాఖ నగరానికి మరోసారి ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని అంటున్నారు రాష్ట్ర మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్‌ మరింత పెంచేలా, దేశం గర్వించేలా ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌ తో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో విశాఖలో జి–20 సదస్సు జరగబోతోంది. ఏర్పాట్లను మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, స్థానిక ఎమ్మెల్యేలు పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు.

‘జి–20 సదస్సుకు 40 దేశాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు విశాఖకు హాజరవుతారు. ఈనెల 28వ తేదీన రాడిసన్‌ బ్లూ హోటల్ లో సమావేశం జరుగుతుంది. అదేరోజు రాత్రి బీచ్ లో జరిగే డిన్నర్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారు. మరో రెండురోజులపాటు సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని మంత్రులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖ అభివృద్ధి మీద సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రులు వివరించారు.

2016 ఫిబ్రవరిలో విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మౌలిక వసతుల కల్పన, నగర సుందరీకరణకోసం 100 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు జి-20 సదస్సుకోసం కూడా నగరంలో సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ఇప్పటికే కొన్ని పనులు పూర్తి చేశారు, ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో రోడ్ల పునర్నిర్మాణం, ఫుట్ పాత్ ల ఏర్పాటు, బీచ్ క్లీనింగ్ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.

First Published:  26 March 2023 1:05 AM GMT
Next Story