Telugu Global
Andhra Pradesh

నారాయణను అడ్డుకున్న పోలీసులు.. రుషికొండ వద్ద టెన్షన్ టెన్షన్

నిత్యం వార్తల్లో నానుతూ ఉండటం సీపీఐ నేత నారాయణకు అలవాటుగా మారింది. తరచూ ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని లేవనెత్తి చర్చను రేకెత్తించడం.. మీడియాకు కావాల్సిన స్టఫ్ అందించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

నారాయణను అడ్డుకున్న పోలీసులు.. రుషికొండ వద్ద టెన్షన్ టెన్షన్
X

నిత్యం వార్తల్లో నానుతూ ఉండటం సీపీఐ నేత నారాయణకు అలవాటుగా మారింది. తరచూ ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని లేవనెత్తి చర్చను రేకెత్తించడం.. మీడియాకు కావాల్సిన స్టఫ్ అందించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై నోరుజారిన నారాయణ.. ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. ఈ రెండు ప్రకటనలు మీడియాలో సెన్సేషనల్ గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా నారాయణ రుషికొండ బీచ్ వద్ద హడావుడి చేసేందుకు ప్రయత్నించారు. విశాఖ రుషికొండ బీచ్ లో అక్రమాలు జరుగుతున్నాయని.. గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ ఈ ఆరోపణల్లో ముందుంటుంది.

ఇదిలా ఉంటే ఈ ఉదయం నారాయణ తన అనుచరులను, కొంతమంది సీపీఐ కార్యకర్తలను వెంటేసుకొని విశాఖ రుషికొండ బీచ్ దగ్గరకు వెళ్లారు. అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని. తాను పరిశీలిస్తానని చెప్పారు. అయితే సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నారాయణను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా రుషికొండ బీచ్ పరిసరాల్లోకి వెళ్లేందుకు వీళ్లేదని పేర్కొన్నారు. దీంతో నారాయణ పోలీసులపై ఫైర్ అయ్యారు.

' నేను రుషికొండ తవ్వకాలను పరిశీలిస్తానంటే పోలీసులకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? నిజంగా అక్కడ ఏ అక్రమాలు జరగకపోతే నన్ను అనుమతించవచ్చు కదా.. కచ్చితంగా అక్కడ చట్ట విరుద్ధంగా ఏదో జరుగుతోంది. అందుకే నన్ను అనుమతించడం లేదు. ఇక్కడ ఐదు ఎకరాలకు అనుమతులు తీసుకొని.. 30 ఎకరాల్లో తవ్వకాలు చేపడుతున్నారు.' అని వాదించారు. ఇక పోలీసులు మాత్రం.. ప్రస్తుతం ఇక్కడికి ఎవరినీ అనుమతించడం లేదని.. ముందస్తు అనుమతి తప్పని సరని తేల్చి చెప్పారు. అయితే రుషికొండ బీచ్ వ్యవహారంలో నారాయణకు రావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. మరి ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు కూడా కాస్త చొరవ తీసుకొని.. ఆరోపణలపై స్పందిస్తారేమో చూడాలి.

First Published:  1 Aug 2022 8:04 AM GMT
Next Story