Telugu Global
Andhra Pradesh

జగన్ నష్ట నివారణ చర్యలు.. విశాఖలో టాస్క్ ఫోర్స్

త్వరలో విశాఖ నుంచే పాలన అంటున్న సీఎం జగన్, ముందుగా ఈ అపవాదుల్ని తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత విశాఖ అనే బ్రాండ్ కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.

జగన్ నష్ట నివారణ చర్యలు.. విశాఖలో టాస్క్ ఫోర్స్
X

విశాఖను పాలనా రాజధానిగా కీర్తిస్తుంది వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా. కానీ ప్రతిపక్షాలు, ప్రతిపక్ష మీడియా మాత్రం అమరావతి విషయంలో రాజీపడేది లేదంటోంది. పనిలో పనిగా విశాఖపై బురదజల్లేందుకు కూడా వెనకాడటంలేదు. వైరి వర్గాల విమర్శలకు బలం చేకూర్చేలా విశాఖలో ఇటీవల జరుగుతున్న ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. ఏకంగా పార్లమెంట్ సభ్యుడి కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ చేయడంతో విశాఖపై నేర రాజధాని అనే ముద్ర వేసేందుకు ప్రతిపక్షం బలంగా ప్రయత్నిస్తోంది, ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కౌంటర్ గా ఇప్పుడు ప్రభుత్వం విశాఖకు టాస్క్ ఫోర్స్ ని చేర్చింది.

విశాఖపట్నంలో ఇటీవల ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కావడం, మరో బిల్డర్ కిడ్నాప్ ఉదంతం సంచలనంగా మారింది. గంజాయి సాగుకి కూడా మన్యం కేరాఫ్ అడ్రస్ అనే ఆరోపణ ఉంది. అసాంఘిక శక్తులకు అడ్డా విశాఖ అనే అపవాదుని రూపుమాపేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ పరిధిలోకి విశాఖను చేర్చింది. విశాఖ పోలీస్‌ కమిషనరేట్‌­ మొత్తాన్ని టాస్క్‌ ఫోర్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి­లోకి తెస్తూ హోం శాఖ ఉత్త­ర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులు మే 24 నుంచి అమలులోకి వచ్చినట్టుగా పేర్కొంది.

టాస్క్ ఫోర్స్ ఎందుకంటే..?

టాస్క్ ఫోర్స్ లేకపోతే.. ఏ ప్రాంతంలో జరిగిన నేరాలకు ఆ ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతాయి. దర్యాప్తు కూడా వారే మొదలు పెట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో విచారణ, శిక్షలు పడేలా చేయడంలో సమన్వయలోపం ఉంటుంది. అదే నేరగాళ్లకు వరంగా మారుతుంది. దీన్ని కట్టడి చేసేందుకే విశాఖకు టాస్క్ ఫోర్స్. ఇక నుంచి విశాఖలో ఏ ప్రాంతంలో అసాంఘిక శక్తులపై అయినా సరే టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులు, గంజాయి అక్రమ రవాణాదారులు, విక్రేతలు, ఈవ్‌ టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడేవారు... ఇలా అన్ని తరహా కేసులను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు చేపడతారు. దీనికోసం టాస్క్‌ ఫోర్స్‌ పోలీస్‌ స్టేషన్‌ కు అదనపు అధికారులు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది.

త్వరలో విశాఖ నుంచే పాలన అంటున్న సీఎం జగన్, ముందుగా ఈ అపవాదుల్ని తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత విశాఖ అనే బ్రాండ్ కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.

First Published:  4 July 2023 12:31 AM GMT
Next Story