Telugu Global
Andhra Pradesh

కాషాయపార్టీకి నాయకత్వం.. పచ్చ పార్టీకి కాపలా

వచ్చేసారి పురందేశ్వరి ఎక్కడినుంచి పోటీ చేస్తారని అడిగారు. ఆ స్థానాన్ని బీజేపీ డిసైడ్ చేస్తుందా, లేక చంద్రబాబు నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. "ఆయన మద్దతు కోసమేగా మీరు ఆయనపై ఈగ కూడా వాలకుండా చూస్తున్నారం"టూ సెటైర్లు పేల్చారు విజయసాయిరెడ్డి.

కాషాయపార్టీకి నాయకత్వం.. పచ్చ పార్టీకి కాపలా
X

పురందేశ్వరిపై మరోసారి వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇటీవల పురందేశ్వరి సొంత ఊరులో బీజేపీకి పడిన ఓట్ల లెక్క చెప్పిన ఆయన, ఇప్పుడు పురందేశ్వరి పోటీ చేసిన విశాఖలో ఆ పార్టీకి పడిన ఓట్ల సంఖ్యను ప్రస్తావించారు. మరోసారి పురందేశ్వరి పరువు తీసేశారు.

పురందేశ్వరి గత లోక్ సభ ఎన్నికల్లో విశాఖనుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోటీలో 20 పోలింగ్ బూత్ లలో కనీసం ఆమెకు ఒక్క ఓటు కూడా పడలేదని చెప్పారు విజయసాయిరెడ్డి. మరో 40 బూత్ లలో 10లోపే ఓట్లు పడ్డాయన్నారు. అలాంటి ప్రజాదరణ ఉన్న ఆమె చివరికి ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు అయ్యారని, అందరికీ కాలం అలా కలసిరాదని ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీకి నాయకత్వం వహిస్తూ పచ్చ పార్టీకి కాపలా కాయడం పురందేశ్వరికి మాత్రమే సాధ్యమని కౌంటర్ ఇచ్చారు.


ఇటీవల చంద్రబాబుకి అనుకూలంగా పురందేశ్వరి చేస్తున్న వ్యాఖ్యల వెనక ఆమె రాజకీయ ఉద్దేశాలను చాలామంది తెరపైకి తెచ్చారు. ఒకవేళ ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు ఖరారయితే సీట్ల పంపకాల్లో గెలిచే స్థానం దక్కేందుకు, పొత్తు లేకపోతే తాను పోటీ చేసే స్థానంలో టీడీపీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టేలా పురందేశ్వరి వ్యూహాలు రచిస్తున్నారని, అందుకే ఆమె చంద్రబాబుకి మద్దతుగా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో విజయసాయి కూడా ఈ పోటీ గురించి ప్రస్తావించారు. వచ్చేసారి పురందేశ్వరి ఎక్కడినుంచి పోటీ చేస్తారని అడిగారు. ఆ స్థానాన్ని బీజేపీ డిసైడ్ చేస్తుందా, లేక చంద్రబాబు నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. ఆయన మద్దతు కోసమేగా మీరు ఆయనపై ఈగ కూడా వాలకుండా చూస్తున్నారంటూ సెటైర్లు పేల్చారు విజయసాయిరెడ్డి.


టీడీపీపై చెణుకులు..

మరోవైపు తెలంగాణలో టీడీపీ డబుల్ గేమ్ పై కూడా చెణుకులు విసిరారు విజయసాయిరెడ్డి. "తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీల్లో పచ్చ కండువాలు స్వైర విహారం చేస్తున్నాయంటే టోటల్ డ్రామాస్ పార్టీ (TDP) ఎటువంటి అపవిత్ర పొత్తులకైనా తెగించిందని అర్థం." అని ట్వీట్ చేశారాయన. ఇంగ్లిష్ మీడియం వల్ల ప్రయోజనం లేదని సీపీఎం రాఘవులు అంటున్నారని, దీన్నిబట్టి తోక పార్టీల్లోనూ కుల, పెత్తందారీ అహంకారం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

First Published:  17 Nov 2023 3:44 PM GMT
Next Story