Telugu Global
Andhra Pradesh

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందెవరు..?

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు అని ఇప్పుడు ఊరూవాడా తిరిగి చెబుతున్నారు కానీ, వెన్నుపోటు పొడిచింది ఎవరనే విషయాన్ని ఎందుకు చెప్పటంలేదు..?

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందెవరు..?
X

'అందర్నీ నమ్మారు వెన్నుపోటుకు గురయ్యారు.. తనవెనుక జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను ఎన్టీఆర్ గమనించలేకపోయారు' ఇది తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు. నిజానికి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని కొత్తగా వెంకయ్య చెప్పాల్సిన అవసరమే లేదు. అయినా పదే పదే ఇదే విషయాన్ని చెబుతున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వెంకయ్య ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురయ్యారనే విషయాన్ని తరచూ ప్రస్తావిస్తున్నారు.

అసలు ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ ను వెంకయ్య ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు..? బహుశా వెంకయ్య కలలోకి వచ్చి ఎన్టీఆర్ భయపెడుతున్నారా..? ఎందుకంటే ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ లో వెంకయ్య పాత్ర ఏమిటి..? అప్పుట్లో ఇదే వెంకయ్య ఎవరికి మద్దతుగా నిలిచారు..? ఎన్టీఆర్ పై ఇప్పుడు సానుభూతి చూపుతున్న వెంకయ్య మరప్పట్లో ఎందుకు బాధితుడికి మద్దతుగా నిలబడలేదు..?

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు అని ఇప్పుడు ఊరూవాడా తిరిగి చెబుతున్నారు కానీ, వెన్నుపోటు పొడిచింది ఎవరనే విషయాన్ని ఎందుకు చెప్పటంలేదు..? ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ ను పదేపదే ప్రస్తావిస్తున్న వెంకయ్య ఏమాశిస్తున్నారో అర్థం కావటంలేదు. తనవెనుక జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను ఎన్టీఆర్ గమనించలేకపోయినట్లు వెంకయ్య చెప్పారు. మరప్పట్లోనే వెన్నుపోటు విషయమై ఎన్టీఆర్ ను అప్రమత్తం చేశారా..? అందర్నీ నమ్మి వెన్నుపోటుకు గురయ్యారని ఇపుడు ఫీలైపోతున్నారు.

ఎన్టీఆర్ నమ్మిన వాళ్ళల్లో తాను కూడా ఒకడిని అన్న విషయాన్ని వెంకయ్య మరచిపోయారా..? పార్టీతో సంబంధంలేకపోయినా ఎన్టీఆర్ తో బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళల్లో వెంకయ్యతో పాటు వామపక్షాల నేతలు కూడా ఉన్నారు. వెన్నుపోటు ఎపిసోడ్ లో అందరూ కలిసి ఎన్టీఆర్ ను దెబ్బకొట్టిన వాళ్ళే. ప్రత్యక్షంగా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది ఒకళ్ళయితే పరోక్షంగా అందుకు సహకరించిన వాళ్ళల్లో వెంకయ్య కూడా ఉన్నారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.

First Published:  25 Dec 2022 5:46 AM GMT
Next Story