Telugu Global
Andhra Pradesh

జగన్ అభిమానుల్ని రెచ్చగొట్టేలా వీర సింహారెడ్డి డైలాగ్స్..

"సంతకాలు పెడితే బోర్డుమీద పేరు మారుతుందేమో కానీ చరిత్ర సృష్టించినవారి పేరు మారదు, మార్చలేరు." ఈరోజు విడుదలైన ట్రైలర్ లో ఉన్న పంచ్ డైలాగ్ ఇది.

జగన్ అభిమానుల్ని రెచ్చగొట్టేలా వీర సింహారెడ్డి డైలాగ్స్..
X

బాలకృష్ణ కొత్త సినిమా, అందులోనూ ఎన్నికల టైమ్ దగ్గరపడిన తర్వాత విడుదలవుతున్న సినిమా, ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య వైరం మరింత ముదిరి పాకాన పడింది. కొట్లాటలు, జైళ్లు, బెయిళ్లు వరకు వెళ్లింది వ్యవహారం. కుప్పంలో చంద్రబాబు రోడ్డుపై కూర్చుని రచ్చ చేస్తున్నారు, లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఈ దశలో బాలయ్య సినిమానుంచి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఏదో ఒకటి ఆశిస్తారు. దాన్ని అందించే క్రమంలో జగన్ అభిమానుల్ని కాస్త రెచ్చగొట్టారు వీరసింహారెడ్డి దర్శకుడు.

"సంతకాలు పెడితే బోర్డుమీద పేరు మారుతుందేమో కానీ చరిత్ర సృష్టించినవారి పేరు మారదు, మార్చలేరు." ఈరోజు విడుదలైన ట్రైలర్ లో ఉన్న పంచ్ డైలాగ్ ఇది. దీన్ని విన్న ఎవరికైనా కచ్చితంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎపిసోడ్ గుర్తురాక మానదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా మార్చిన తర్వాత ఏపీలో పెద్ద గొడవే జరిగింది. యూనివర్శిటీ స్థాపనకు కృషి చేసిన ఎన్టీఆర్ పేరుని ఎలా మారుస్తారంటూ టీడీపీ నేతలు గొడవ చేశారు. నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు వీరసింహారెడ్డిలో దీన్ని గుర్తు చేసేలా డైలాగ్ పెట్టారు.


చరిత్రని మార్చలేరు, చరిత్ర సృష్టించినవారి పేరు మార్చలేరు అంటూ బాలయ్య చెబుతున్న పవర్ ఫుల్ డైలాగ్ కచ్చితంగా జగన్ ని టార్గెట్ చేసిందని చెప్పాలి. ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది. ఈ డైలాగ్ సూపర్ అంటూ నందమూరి అభిమానులు కూడా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. దీనిపై ఇంకా వైసీపీ నుంచి ఎవరూ స్పందించలేదు. సినిమా విడుదలయ్యాక అందులో ఇలాంటి డైలాగులు మరికొన్ని ఉంటే మాత్రం ఏపీలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో పెరుగుతుందనడంలో అనుమానం లేదు.

Next Story