Telugu Global
Andhra Pradesh

వాసిరెడ్డి పద్మ రాజీనామా.. కారణం ఏంటంటే..?

వాసిరెడ్డి పద్మ రాజీనామాతో ఎల్లో మీడియాలో రచ్చ మొదలైంది. వైసీపీకి షాక్ అంటూ ఎల్లో మీడియా కథనాలిస్తోంది.

వాసిరెడ్డి పద్మ రాజీనామా.. కారణం ఏంటంటే..?
X

ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల వేళ ఆమె రాజీనామా సంచలనంగా మారింది. సీఎంకి తన రాజీనామా లేఖను పంపించారామె. రాబోయే ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయాలని భావిస్తున్నట్టు ఆమె తన లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పని చేయడానికి సిద్దంగా ఉన్నట్టుగా ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఎల్లో మీడియా హడావిడి..

వాసిరెడ్డి పద్మ రాజీనామాతో ఎల్లో మీడియాలో రచ్చ మొదలైంది. వైసీపీనుంచి ఆమె టికెట్ ఆశించారని, తనకు కాకపోయినా తన భర్తకయినా వైసీపీ టికెట్ ఇప్పించుకోవాలని చూశారని, చివరకు ఏదీ సాధ్యం కాకపోవడంతో ఆమె రాజీనామా చేశారని అంటున్నారు. వైసీపీకి షాక్ అంటూ ఎల్లో మీడియా కథనాలిస్తోంది. ఆమె రాజీనామా చేసింది మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి కానీ, పార్టీకి కాదు. కానీ ఆ విషయాన్ని చెప్పకుండా వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడుపోతున్నాట్టుగా ఎల్లో మీడియా కట్టుకథనాలు ప్రసారం చేయడం గమనార్హం.

రాజీనామా ఎందుకంటే..?

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వాసిరెడ్డి పద్మ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్ బలంగా వినిపించారామె. ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక ఆమె వైసీపీలో చేరారు, అక్కడ కూడా అధికార ప్రతినిధిగా పని చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు మహిళా కమిషన్ చైర్ పర్సన్‌ పదవి లభించింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఆమె తన విధులు సమర్థంగా నిర్వహించారనే పేరు తెచ్చుకున్నారు. వార్డు వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జనసేనానికి నోటీసులు పంపి ఆమె కలకలం రేపారు. ఆ తర్వాత పవన్ పై పోలీసులకు కూడా వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు సడన్ గా ఆమె మహిళా కమిషన్ కి దూరం కావడం ఆసక్తికరంగా మారింది.

తన రాజీనామాకు, ఎమ్మెల్యే సీటుకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నానని, ఎన్నికల సమయంలో ప్రజలతో మమేకం కాలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేశానని పేర్కొన్నారు. ఆమె అంత క్లారిటీతో ఉన్నా కూడా ఎల్లో మీడియా మాత్రం అసంతృప్తి, అలక అంటూ చిలువలు పలువలు చేస్తోంది.

First Published:  7 March 2024 7:00 AM GMT
Next Story