Telugu Global
Andhra Pradesh

దత్తపుత్రుడు కాదు, విష పుత్రుడు.. వాసిరెడ్డి పద్మ హాట్ కామెంట్స్

చాలా విషయాల్లో పవన్ ని ప్రశ్నించాలని ఉందని, ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుందని, కానీ సభ్యత ఉంది కనుకే నోటీసులు ఇస్తున్నామన్నారు వాసిరెడ్డి పద్మ.

దత్తపుత్రుడు కాదు, విష పుత్రుడు.. వాసిరెడ్డి పద్మ హాట్ కామెంట్స్
X

ఏపీనుంచి ఏడాదికేడాది అదృశ్యమయ్యే మహిళల సంఖ్య పెరుగుతోందంటూ పవన్ కల్యాణ్.. కేంద్ర హోం శాఖ ప్రకటనను ఉటంకిస్తూ చేసిన విమర్శలపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ దత్తపుత్రుడే కాదని, విషపుత్రుడని మండిపడ్డారు. తప్పిపోయిన వారిలో 70 శాతం వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించడంలేదని ప్రశ్నించారు. మహిళల అదృశ్యంలో ఏపీ 11వ స్థానంలో ఉందన్న విషయాన్ని పవన్ ఎందుకు ప్రస్తావించలేదని, కేవలం మిస్ అయిన మహిళల సంఖ్యను చూపించి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్.

వాలంటీర్ వ్యవస్థ వల్లే ఏపీలో మహిళలు అదృశ్యమవుతున్నారని అంటున్న పవన్.. ప్రేమ వ్యవహారాల వల్లనే చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారని తెలుసుకోవాలని చెప్పారు వాసిరెడ్డి పద్మ. ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా అని ప్రశ్నించారు. చేతనైతే మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటూ ఉచిత సలహాలిచ్చిన పవన్, నోటీసులిస్తే మాత్రం వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు పవన్ కల్యాణ్ కి కనిపించవా అని ప్రశ్నించారు వాసిరెడ్డి పద్మ. ఒక క్రిమినల్ కహానీ అల్లి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కల్యాణ్ కుట్ర అన్నారు. సినిమా హీరోలు ఏం చెప్పినా చెల్లుతుందా అన్నారు. చాలా విషయాల్లో పవన్ ని ప్రశ్నించాలని ఉందని, ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుందని, కానీ సభ్యత ఉంది కనుకే నోటీసులు ఇస్తున్నామన్నారు వాసిరెడ్డి పద్మ. మహిళల మిస్సింగ్ వ్యవహారంలో తెలంగాణ ఆరో స్థానంలో ఉంటే పవన్ ఎందుకు నోరు విప్పరన్నారు. మహిళా కమిషన్ అంటే పవన్ కు చులకన భావం అన్నారు. పవన్ ట్వీట్ వేస్తూ అందులో మహిళా కమిషన్ ని కూడా చేర్చడం, రేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా అంటూ ప్రశ్నించడంతో ఈరోజు వాసిరెడ్డి పద్మ సీరియస్ గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది.

First Published:  27 July 2023 12:26 PM GMT
Next Story