Telugu Global
Andhra Pradesh

మేం నలుగురం నిజాయితీ పరులం.. వైసీపీ వాళ్లే అమ్ముడుపోయారు

ఇలాంటి పొలిటికల్ గేమ్ లో తమ మాజీ బాస్ చంద్రబాబు సిద్ధహస్తుడని అన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఆయన చేసిన పనివల్ల ఇరు వర్గాలకు లాభం జరిగిందన్నారు.

మేం నలుగురం నిజాయితీ పరులం.. వైసీపీ వాళ్లే అమ్ముడుపోయారు
X

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. టీడీపీకి ఓటు వేసిన ఆ నలుగురు ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వచ్చినా.. చాలామంది భుజాలు తడుముకోవడం విశేషం. ఈ క్రమంలో టీడీపీ నుంచి బయటకొచ్చిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు ఒకే మాటపై ఉన్నామని చెప్పారు వల్లభనేని వంశీ. టీడీపీతో బంధం తెంచుకుని బయటకొచ్చాక తామంతా జగన్ తోనే ఉన్నామని, తిరిగి చంద్రబాబుకి దగ్గరవ్వాల్సిన అవసరం తమకు లేదన్నారు. క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన ఆ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలేనని చెప్పారు. వారే డబ్బుకి అమ్ముడు పోయారన్నారు.

మా ఎక్స్ బాస్ అందులో సిద్ధహస్తుడు..

ఇలాంటి పొలిటికల్ గేమ్ లో తమ మాజీ బాస్ చంద్రబాబు సిద్ధహస్తుడని అన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమో, అసంతృప్తి ఉన్నవారిని లాక్కోవడమో చంద్రబాబు చేసి ఉంటారని అన్నారు. ఆయన చేసిన పనివల్ల ఇరు వర్గాలకు లాభం జరిగిందన్నారు వంశీ. వైసీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు ముట్టాయని, చంద్రబాబుకి ఎమ్మెల్సీ సీటు వచ్చిందని చెప్పుకొచ్చారు. టీడీపీకి మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు ఎవరో తమకు తెలుసని, వారిని ఏం చేయాలో జగన్ కి తెలుసని చెప్పుకొచ్చారు. వారిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

వారిది తప్పు.. మాది ఒప్పు..

వైసీపీ టికెట్ పై గెలిచి టీడీపీకి ఓటు వేయడం వెన్నుపోటు, దుర్మార్గం.. అంటూ నిన్నటి నుంచి వైసీపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక తండ్రికి, తల్లికి పుట్టినవారు ఇలాంటి పని చేయరని ఎంపీ మార్గాని భరత్ కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు. అదే సమయంలో టీడీపీ టికెట్ పై గెలిచి, వైసీపీకి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిని ఏమనాలి అనే ప్రశ్న కూడా వినపడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అసంతృప్తి ఓట్లు తమకే పడతాయనే ధీమాతో వైసీపీ అభ్యర్థుల్ని నిలబెట్టింది. అలాగే వారి ఓట్లు పడ్డాయి కూడా. అయితే వైసీపీలో అసంతృప్తి ఓట్లు టీడీపీకి వెళ్లడంతో మొత్తం వ్యవహారం తారుమారయింది. దీంతో నీతి, నిజాయితీ, నమ్మకం.. అనే పెద్ద పెద్ద పదాలు బయటకొస్తున్నాయి.

First Published:  24 March 2023 6:59 AM GMT
Next Story