Telugu Global
Andhra Pradesh

నాడు అమరావతి వర్సెస్ సీమ.. నేడు అమరావతి వర్సెస్ ఉత్తరాంధ్ర..

అమరావతి యాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా.. ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తామంటే కుదరదంటున్నారు ఆ ప్రాంత మంత్రులు. ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దు అంటున్నవారు.. తమ ప్రాంతంలో ఎలా అడుగుపెడతారంటూ నిలదీస్తున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.

నాడు అమరావతి వర్సెస్ సీమ.. నేడు అమరావతి వర్సెస్ ఉత్తరాంధ్ర..
X

అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ ఆమధ్య రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అనే యాత్ర చేశారు. అమరావతిలోని ఏపీ హైకోర్టు నుంచి తిరుమల శ్రీవారి దేవస్థానం వరకు రైతులు యాత్ర చేపట్టారు. ఆ యాత్ర మధ్యలో ఉండగానే ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే ఆ తర్వాత దాన్ని తిరిగి ప్రవేశపెడతారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి రైతులు యాత్ర మొదలుపెడుతున్నారు. హైకోర్టు ఈ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమరావతి టు అరసవెల్లి యాత్రకు ప్రణాళిక సిద్ధమైంది.

ఉత్తరాంధ్రలో అలజడి..

అమరావతి యాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా.. ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తామంటే కుదరదంటున్నారు ఆ ప్రాంత మంత్రులు. ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దు అంటున్నవారు.. తమ ప్రాంతంలో ఎలా అడుగు పెడతారంటూ నిలదీస్తున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడితే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు కావాలనే ఇలాంటి యాత్రలు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు.

గతంలో అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ అమరావతి రైతులు చేసిన న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర విషయంలో పెద్దగా అడ్డంకులు ఎదురు కాలేదు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వాసులు రైతు యాత్రకు స్వాగతం పలికారే కానీ ఎక్కడా అవాంతరాలు ఎదురవలేదు. ఒకటి రెండు చోట్ల టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా వైసీపీ నాయకులు పట్టించుకోలేదు. యాత్ర సజావుగా సాగింది. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర యాత్ర విషయంలో అనుమానాలు బలపడుతున్నాయి. వైసీపీ నాయకులు యాత్ర విషయంలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకు జరుగుతున్న యాత్రను దండయాత్రలా అభివర్ణిస్తున్నారు. మరి ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.

ప్రస్తుతానికి టీడీపీ ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్నా.. ఒకసారి యాత్ర మొదలయితే అక్కడ ఆకుపచ్చ జెండాలతో పాటు, పసుపు పచ్చ జెండాలు కూడా పోటీగా కనపడతాయి. టీడీపీ నేతలే యాత్రకు సరంజామా సమకూరుస్తారనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. అమరావతి విషయాన్ని మరికొన్ని రోజులపాటు హాట్ టాపిక్‌గా ఉంచాలనేదే చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలో వైసీపీ నేతల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు ఉంటాయనడంలో సందేహం లేదు. దీంతో ఈ యాత్ర ఎలా మొదలై, ఎలా ముగుస్తుందో తేలడంలేదు. తిరుమల యాత్రను ప్రశాంతంగా ముగించిన రైతులు, అరసవెల్లి యాత్రను కూడా అంతే ప్రశాంతంగా ముగిస్తారా, లేక ఏపీలో మరో కలకలం సృష్టిస్తారా అనేది వేచి చూడాలి.

First Published:  10 Sep 2022 7:53 AM GMT
Next Story