Telugu Global
Andhra Pradesh

వీళ్ళక్కూడా ఇవే చివరి ఎన్నికలా?

సరే ఎవరి ప్రచారాలు ఎలాగున్నా పార్టీ భవిష్యత్తు ఏమిటో ఇప్పుడే ఎవరూ చెప్పలేకపోయినా చాలా మంది తమ్ముళ్ళకి మాత్రం వయసు రీత్యా రాబోయేవే చివరి ఎన్నికలన్నది వాస్తవం.

వీళ్ళక్కూడా ఇవే చివరి ఎన్నికలా?
X

రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు చాలామంది తమ్ముళ్ళకు కూడా చివరి ఎన్నికల్లాగానే ఉన్నాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ అని నమ్మకం ఉన్న చాలామంది సీనియర్ తమ్ముళ్ళు తమ ప్రచారంలో సెంటిమెంటును ప్రయోగిస్తున్నారు. 2024 ఎన్నికలే తమకు చివరి ఎన్నికలు కాబట్టి తమను గెలిపించాలంటు జనాలను రిక్వెస్ట్‌ చేసుకుంటున్నారు. పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలను కూడా తమ గెలుపున‌కు సహకరించాలని బతిమలాడుకుంటున్నారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాబోయేవే చివరి ఎన్నికలనే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారట. 2024 ఎన్నికల తర్వాత తాను పోటీచేసేది లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించాలని జనాలను బతిమలాడుకుంటున్నారు. నాలుగుసార్లు వరుసగా ఓడిపోయిన ఈ నేతకు టికెట్ దక్కేది కూడా అనుమానమే. టీడీపీ తరపున పోటీ చేయబోయేది తానే కాబట్టి గెలిపించాలంటున్నారు.

విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి, విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, శ్రీకాకుళంలో గుండా లక్ష్మీదేవి, ఎచ్చెర్లలో కమిడి కళావెంకట్రావు లాంటి చాలామందికి రాబోయే ఎన్నికలే చివరి ఎన్నికలని చెప్పుకుంటున్నారట. ఎందుకంటే వీళ్ళంతా దాదాపు 73 ఏళ్ళ దగ్గరున్నారు. కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పతివాడ నారాయణస్వామినాయుడు లాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల నుండి దాదాపు తప్పుకున్నట్లే అనుకోవాలి.

ఒకవైపు రాబోయే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని స్వయంగా చంద్రబాబునాయుడే చెప్పారు. తనకు చివరి ఎన్నికలు అంటే తెలుగుదేశం పార్టీకి కూడా చివరి ఎన్నికలని జనాలు కూడా అనుకున్నారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు మాటనే బాగా ప్రచారం చేశారు. సరే ఎవరి ప్రచారాలు ఎలాగున్నా పార్టీ భవిష్యత్తు ఏమిటో ఇప్పుడే ఎవరూ చెప్పలేకపోయినా చాలామంది తమ్ముళ్ళకి మాత్రం వయసు రీత్యా రాబోయేవే చివరి ఎన్నికలన్నది వాస్తవం. మరి సీనియర్ తమ్ముళ్ళ వారసులుగా జూనియర్ తమ్ముళ్ళు వచ్చే ఎన్నికల్లో ఏమి చేస్తారో చూడాలి.

First Published:  17 Feb 2023 6:00 AM GMT
Next Story