Telugu Global
Andhra Pradesh

తిరుమలలో ఆమె ఓవర్ యాక్షన్ చేశారు.. టీటీడీ వివరణ

దర్శనం విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ తిరుమలలో ఉత్తరప్రదేశ్ నటి అర్చనా గౌతమ్ సృష్టించిన హల్ చల్ పై టీటీడీ స్పందించింది. టీటీడీ పై ఆమె చేస్తున్న ఆరోపణలు ఖండించింది. అధికారులపై అర్చనా గౌతమ్ దాడి చేశారని టీటీడీ ఆరోపించింది.

తిరుమలలో ఆమె ఓవర్ యాక్షన్ చేశారు.. టీటీడీ వివరణ
X

ఉత్తర ప్రదేశ్ కి చెందిన నటి అర్చనా గౌతమ్ తిరుమలలో టీటీడీ ఏఈవో ఆఫీస్ ముందు చిందులు తొక్కడం వార్తల్లో ప్రముఖంగా కనిపించిన విషయం తెలిసిందే. దర్శనాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని, దర్శనం కోసం 10వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారంటూ అర్చనా గౌతమ్ ఆరోపిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. టీటీడీ సిబ్బంది తనపై దాడి చేశారని కూడా అన్నారామె. అడిషనల్ ఈవో ఆఫీస్ ముందు అర్చనా గౌతమ్ హడావిడి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టీటీడీ వివరణ ఇచ్చింది. టీటీడీ ఉద్యోగులపై ఆమె చేయి చేసుకున్నారని అన్నారు అధికారులు. అవాస్తవ ఆరోపణలను భక్తులు నమ్మవద్దని కోరారు.

అసలేం జరిగింది..?

ఉత్తర ప్రదేశ్ కి చెందిన నటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అర్చనా గౌతమ్ తోపాటు మరో ఎనిమిదిమంది ఆగస్ట్ 31న శ్రీవారి దర్శనం కోసం కేంద్ర సహాయమంత్రి సిఫారసు లెటర్ తీసుకొచ్చారు. 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు మంజూరు చేశారు అధికారులు. కానీ వారు దర్శనానికి వెళ్లలేదు. ఒకరోజు ఆలస్యంగా దర్శనానికి వెళ్లగా సిబ్బంది తిప్పి పంపించేశారు. దీంతో నటి అర్చనా గౌతమ్ అడిషనల్ ఈవో కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఆమె చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీటీడీ సిబ్బంది తనపై దాడి చేశారంటూ అర్చనా గౌతమ్ ఏడుస్తూ ఆ వీడియోలో ఆరోపించారు.

అదంతా అవాస్తవం..

అర్చనా గౌతమ్ ఓవర్ యాక్షన్ చేశారంటూ ప్రత్యారోపణలు చేస్తోంది టీటీడీ. ఆమెతోపాటు మిగతావారికి కూడా రెండోసారి 300 రూపాయల దర్శన టికెట్లు కేటాయించామని, వాటిని కూడా వారు వినియోగించుకోలేదని చెప్పారు అధికారులు. అర్చనా గౌతమ్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో టీటీడీ సిబ్బంది కూడా తాము తీసిన వీడియోని చూపించారు. ఆ వీడియోలో అర్చనా గౌతమ్ దురుసుగా ప్రవర్తించిన విషయం బయటపడటంతో.. ఆమె అక్కడినుంచి వెళ్లిపోయారని అన్నారు. ఇక వీఐపీ బ్రేక్ దర్శనం కావాలంటే రూ.10,500/- చెల్లించి శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ పొందాలని తమ సిబ్బంది సలహా ఇచ్చారని, అంతేకాని.. దర్శనానికి 10వేల రూపాయలు డిమాండ్ చేశారనే ఆరోపణ అవాస్తవం అన్నారు. సెలబ్రిటీలు అయినంత మాత్రాన తాము ఏది చెప్పినా జనం నమ్ముతారనుకోవడం సరికాదని, ఇలాంటి అవాస్తవాలను ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు టీటీడీ అధికారులు.


First Published:  5 Sep 2022 3:30 PM GMT
Next Story