Telugu Global
Andhra Pradesh

హామీలన్నీ అమలు చేశారట..! ఇన్ని అబద్ధాలా మోడీ?

విభజన హామీలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసిందని ఒకవైపు జనాలంతా మండిపోతుంటే మరోవైపు అన్నింటినీ అమలు చేసినట్లు ప్రకటించేసుకోవటమే విడ్డూరంగా ఉంది.

హామీలన్నీ అమలు చేశారట..! ఇన్ని అబద్ధాలా మోడీ?
X

రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి ఇచ్చిన హామీలన్నింటినీ ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసేసిందట. అలా అని పార్లమెంటులో హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. ఎంత నిసిగ్గుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలా ప్రకటించుకున్నదో అర్థంకావటంలేదు. విభజన హామీలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసిందని ఒకవైపు జనాలంతా మండిపోతుంటే మరోవైపు అన్నింటినీ అమలు చేసినట్లు ప్రకటించేసుకోవటమే విడ్డూరంగా ఉంది.

అప్పటి విభజన హామీల్లో ప్రధానమైనవి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్, పోలవరంను జాతీయప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రమే నిర్మించటం, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటు భర్తీ చేయటం లాంటివి. అయితే నరేంద్ర మోడీ ప్రధాని కాగానే హోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. విశాఖ రైల్వేజోన్ కుదరదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యంకాదని చెప్పేసింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులను రెండేళ్ళిచ్చి తర్వాత ఆపేసింది. విడతలవారీగా ఆర్థికలోటును నెల కిందట భర్తీ చేసింది.

పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు దుస్థితిలో ఉందంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబునాయుడే. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని బలవంతంగా చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. అలా ఎందుకు తీసుకున్నారో అందరికీ తెలిసిందే. ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టేశారు. రైల్వేజోన్ ఏర్పాటును డిమాండ్ చేయలేదు. జిల్లాల అభివృద్ధికి నిధులను ఆపేసినా అడగలేదు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు మీద ఎన్ని డ్రామాలు జరిగాయో అందరూ చూస్తున్నదే. రెవెన్యూ లోటు భర్తీని రాబట్టుకోవటంలో ఫెయిలయ్యారు.

చంద్రబాబు చేతకానితనాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని మోడీ విభజన హామీలను తుంగలో తొక్కేసింది. హోదా ప్లేస్‌లో ప్రత్యేక ప్యాకేజీని పట్టుకొచ్చింది. దీనిద్వారా రాష్ట్రానికి జరిగిన మేలు ఏమిటో ఎవరికీ అర్థంకావటంలేదు. యూపీఏ ప్రభుత్వం బీజేపీ అంగీకారంతోనే అప్పట్లో విభజన హామీలను ప్రకటించింది. వాస్తవాలు ఇలాగుంటే తాజాగా నిత్యానందరాయ్ మాత్రం విభజన హామీలన్నింటినీ కేంద్ర అమలు చేసేసిందని ప్రకటించటమే విచిత్రంగా ఉంది. ఇన్ని అబద్ధాలు చెబుతున్నది కనుకనే జనాలు కొర్రుకాల్చి బీజేపీకి వాతలుపెడుతున్నది.

First Published:  26 July 2023 5:20 AM GMT
Next Story