Telugu Global
Andhra Pradesh

కిషన్ రెడ్డి నోట.. కక్షసాధింపు మాట

ఓవైపు ఏపీలో అభివృద్ధి జరగడంలేదంటూనే.. జరిగిన ఆ కాస్త అభివృద్దికి కారణం కేంద్ర ప్రభుత్వమేనంటున్నారు కిషన్ రెడ్డి. అభివృద్ది చేసినా కూడా.. కొందరు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

కిషన్ రెడ్డి నోట.. కక్షసాధింపు మాట
X

తస్మదీయులపై ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రయోగించడం కక్షసాధింపు రాజకీయం కాదట..

ప్రలోభాలతో పార్టీలను చీల్చి కూటములను విడగొట్టి అధికారం చేజిక్కించుకోవడం కక్షసాధింపు కాదట..

మాట వినకపోతే బుల్డోజర్లు పంపించి బెదిరించడం కక్షసాధింపు కాదట..

ఏపీలో మాత్రమే కక్షసాధింపు రాజకీయాలు జరుగుతున్నాయట. అందుకే ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతోందట. విశాఖ పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్టేట్ మెంట్ ఇది. ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందని, కుటుంబ పార్టీల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక్క బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని సెలవిచ్చారు.

ఏపీని అభివృద్ధి చేసింది కేంద్రమే..

ఓవైపు ఏపీలో అభివృద్ధి జరగడంలేదంటూనే.. జరిగిన ఆ కాస్త అభివృద్దికి కారణం కేంద్ర ప్రభుత్వమేనంటున్నారు కిషన్ రెడ్డి. అభివృద్ది చేసినా కూడా.. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు, బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పర్యాటక అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. విశాఖపట్నం రాజధాని ప్రాంతం అని, జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీగా మాధవ్‌ ని ఆశీర్వదించి మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాధవ్ వంటి వారుంటే.. ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు.

లాజిక్ లేకుండానే మేజిక్..

ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న హామీ. కనీసం దానిపై కిషన్ రెడ్డి నోరు మెదపలేదు. పోనీ విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ మూసివేత గురించి మాట్లాడారా అంటే అదీ లేదు. రైల్వే జోన్, విశాఖ మెట్రో.. ఇలాంటి వాటికి కూడా కిషన్ రెడ్డి ప్రసంగంలో చోటు లేదు. మరి ఏపీలో బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ది ఏంటి..? పైగా కుటుంబ పాలన అంటూ గ్లోబల్ సమ్మిట్ కి వెళ్లి రాజకీయాలు మాట్లాడ్డం ఏంటి అని విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్ పని అయిపోయినట్టే, హోదా విషయంలో మోసం చేసినందుకు బీజేపీకి కూడా ఏపీలో చోటు లేదంటున్నారు. కక్షసాధింపు రాజకీయాలంటూ బీజేపీ నేతలు మాట్లాడటం మరింత హాస్యాస్పదం అని అంటున్నారు.

First Published:  4 March 2023 6:51 AM GMT
Next Story