Telugu Global
Andhra Pradesh

నోటిఫికేషన్లు ఉంటాయా..? ఉండవా..? నిరుద్యోగుల్లో జమిలి భయం..

జమిలి ఖాయమై ఏపీలో ఎన్నికలు ముందుకు జరిగితే, రేపోమాపో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే.. ఇక గ్రూప్స్ సంగతి అంతే అని భయపడుతున్నారు నిరుద్యోగులు.

నోటిఫికేషన్లు ఉంటాయా..? ఉండవా..? నిరుద్యోగుల్లో జమిలి భయం..
X

జమిలి ఎన్నికల వ్యవహారం రాజకీయ పార్టీల్లోనే కాదు, నిరుద్యోగుల్లో కూడా కలవరానికి కారణం అవుతోంది. వివిధ రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ, వరుస నోటిఫికేషన్లు వస్తాయనే అంచనాలున్నాయి. ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్ట్ లకు ఆల్రడీ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడమే తరువాయి. అయితే అంతలోనే జమిలి ఎన్నికల హడావిడి మొదలైంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కూడా అందుకేనంటున్నారు. ఈ దశలో నోటిఫికేషన్లు ఉంటాయా లేవా అనే అనుమానాలు నిరుద్యోగుల్లో మొదలయ్యాయి.

ఏపీలో ఆల్రడీ గ్రూప్-2 కోసం ఎదురు చూస్తున్నవారు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలంటున్నారు, పోస్ట్ ల సంఖ్య పెంచాలంటున్నారు. వారి వాదన ఎలా ఉన్నా.. జమిలి ఖాయమైతే నోటిఫికేషన్లకు సమస్య ఉంటుందా ఉండదా అనేదే అసలు ప్రశ్న. వాస్తవానికి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైతే ఉద్యోగాల భర్తీ నోటఫికేషన్లు విడుదల చేసేందుకు కోడ్ అడ్డు వస్తుంది. ఆలోగా నోటిఫికేషన్లు విడుదలైతే ఇబ్బంది ఉండదు. అయితే ప్రభుత్వాలకు ఉద్యోగార్థులకు ఉన్నంత తొందర ఉండదు. ఇప్పుడు కాకపోతే ఎన్నికలైపోయాక నోటిఫికేషన్లిస్తామంటూ కులాసాగా చెబుతాయి. అందుకే నిరుద్యోగులు టెన్షన్ పడుతున్నారు. జమిలి ఖాయమై ఏపీలో ఎన్నికలు ముందుకు జరిగితే, రేపోమాపో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే.. ఇక గ్రూప్స్ సంగతి అంతే అని భయపడుతున్నారు నిరుద్యోగులు.

జమిలి ఎన్నికలకోసం అధికార యంత్రాంగం సమాయత్తమయితే, నోటిఫికేషన్లకు ఇబ్బంది అనే వార్తలు ఇప్పుడు ఏపీలో బలంగా వినపడుతున్నాయి. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేవారికి కూడా ఇదే విషయమై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో పలుమార్లు గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు విడుదలవుతాయనే ప్రచారాలు అసత్యాలుగా మిగిలిపోయాయి. ఈసారి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది కాబట్టి, కచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయని అంటున్నారు. నిరుద్యోగుల్లో మాత్రం డైలమా కొనసాగుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రభుత్వాలు తలచుకుంటే మాత్రం నోటిఫికేషన్లు ఆగవు. జమిలి సాకుతో నోటిఫికేషన్లు ఆపాలనుకుంటే మాత్రం ఏవీ జరగవు.

First Published:  6 Sep 2023 7:01 AM GMT
Next Story