Telugu Global
Andhra Pradesh

నీవు లేక నేను లేన‌ని.. నీ వెంటే నేనూ అని.. - భార్య మ‌ర‌ణాన్ని తట్టుకోలేక భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

త‌ల్లిదండ్రుల మ‌ర‌ణ వార్త తెలియ‌డంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్న కృష్ణ‌.. వారి మృత‌దేహాల‌ను చూసి క‌న్నీరుమున్నీరుగా విల‌పించాడు. త‌ల్లిదండ్రుల మృత‌దేహాల వ‌ద్ద గుండెల‌విసేలా అత‌ను రోదిస్తున్న తీరు చూప‌రులను క‌ల‌చి వేసింది.

నీవు లేక నేను లేన‌ని.. నీ వెంటే నేనూ అని..  - భార్య మ‌ర‌ణాన్ని తట్టుకోలేక భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌
X

డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. త‌న‌కు అన్నింటా చేదోడువాదోడుగా నిలుస్తూ.. త‌న‌తో తోడుగా సాగిన భార్య ఇక లేద‌నే నిజాన్ని ఆ భ‌ర్త భ‌రించ‌లేక‌పోయాడు.. నీవు లేని నేను లేనంటూ.. నీ వెంటే నేనూ అంటూ.. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. అమ‌లాపురం ప‌ట్ట‌ణ ఇన్‌చార్జి సీఐ పి.వీర‌బాబు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అమ‌లాపురం ప‌ట్ట‌ణంలోని కొంకాప‌ల్లికి చెందిన‌ బోనం శ్రీ‌రామ విజ‌యకుమార్ (47), తుల‌సీ ల‌క్ష్మి (45) అన్యోన్య దంప‌తులు. ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండేవారు కాదు. వారి కుమారుడు కృష్ణ విజ‌య‌వాడ‌లో హాస్ట‌ల్‌లో ఉండి ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. విజ‌యకుమార్ ఓఎన్జీసీలో స‌బ్ కాంట్రాక్టులు చేసేవారు. ఆయ‌న‌కు వ్యాపార వ్య‌వ‌హారాల్లో భార్య చేదోడువాదోడుగా ఉండేవారు.

విధి చిన్న‌చూపు...

ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో ఒక్క‌సారిగా కుదుపు.. మూడు నెల‌ల క్రితం తుల‌సీ ల‌క్ష్మి అనారోగ్యానికి గురైంది. మెద‌డుకు సంబంధించిన స‌మ‌స్య ఉంద‌ని, శ‌స్త్ర చికిత్స చేయించాల‌ని వైద్యులు చెప్ప‌డంతో ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై ఆందోళ‌న‌కు గుర‌య్యాడు. భార్యను కాపాడుకునేందుకు విజ‌య‌కుమార్ ల‌క్ష‌ల రూపాయ‌లు వెచ్చించి మ‌రీ వైద్యం చేయించాడు. ఆస్తుల‌న్నీ క‌రిగినా.. కోలుకోలేక‌పోతామా.. అన్న ధీమాతో ముందుకు సాగుతున్న ఆ కుటుంబంపై విధి చిన్న చూపు చూసింది. ఆమె కోలుకుంటోంద‌నుకున్న త‌రుణంలో నాలుగు రోజులుగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆదివారం ఉద‌యం నిద్ర లేచిన విజ‌య‌కుమార్ భార్య‌ను నిద్ర లేపేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. ఎంత‌కీ క‌ద‌ల‌లేదు. దీంతో ప్రాణం విడిచిన‌ట్టు గుర్తించిన విజ‌య‌కుమార్ గుండెల‌విసేలా రోదించారు. ఒక‌వైపు భార్య దూర‌మ‌వ‌డం.. మ‌రోవైపు ఆర్థిక ఇబ్బందులతో స‌త‌మ‌త‌మ‌వుతుండ‌టం.. నేప‌థ్యంలో తీవ్ర మ‌న‌స్తాపానికి గురై మేడ‌పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు.

త‌ల్లీ, తండ్రీ ఒకేసారి దూర‌మై...

త‌ల్లిదండ్రుల మ‌ర‌ణ వార్త తెలియ‌డంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్న కృష్ణ‌.. వారి మృత‌దేహాల‌ను చూసి క‌న్నీరుమున్నీరుగా విల‌పించాడు. త‌ల్లిదండ్రుల మృత‌దేహాల వ‌ద్ద గుండెల‌విసేలా అత‌ను రోదిస్తున్న తీరు చూప‌రులను క‌ల‌చి వేసింది. తుల‌సీ ల‌క్ష్మి తండ్రి తోలేటి గోవింద్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story