Telugu Global
Andhra Pradesh

పింఛన్లు అందక మనస్తాపంతో ఇద్దరు వృద్ధుల మృతి

కూలి పని చేసుకునే వెంకట్రావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావు మృతి పట్ల కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు.

పింఛన్లు అందక మనస్తాపంతో ఇద్దరు వృద్ధుల మృతి
X

చంద్రబాబు అండ్‌ కో చేసిన కుట్ర కారణంగా ఎన్నికల కమిషన్‌ వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇవేవీ తెలియని పలువురు వృద్ధులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకటో తేదీ వస్తే చాలు.. వేకువజామునే ఇంటికొచ్చి పింఛను అందించే వలంటీర్లు ఈసారి రెండో తేదీ వచ్చేసినా పింఛను ఇచ్చేందుకు రాకపోవడంతో ఏం జరిగిందో అర్థంగాక అయోమయానికి గురవుతున్నారు. వలంటీర్లు ఫోన్లు కూడా వెనక్కి ఇచ్చేయడంతో ఏం జరిగిందో తెలియక పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. మరికొందరు ఆ ఆందోళనతోనే గుండె ఆగి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.

కాకినాడ, తిరుపతి ప్రాంతాల్లో ఇద్దరు వృద్ధులు మంగళవారం ఇదేవిధంగా మృతిచెందారు. ఈ ఘటనలతో ప్రజల్లో ఈ నిబంధన తీసుకొచ్చిన ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాకినాడ రూరల్‌ తూరంగి గ్రామానికి చెందిన కె.వెంకట్రావు (70) అనే వృద్ధుడు ఫించన్‌ అందలేదన్న ఆందోళనతో తానే స్వయంగా సచివాలయానికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందామనుకున్నాడు. అయితే మార్గంలోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.

కూలి పని చేసుకునే వెంకట్రావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావు మృతి పట్ల కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. వృద్ధుడు మృతిచెందిన విషయాన్ని సీఎం జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంకట్రావ్‌ మృతిపై చలించిపోయిన సీఎం జగన్‌.. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

తిరుపతిలోనూ...

తిరుపతి జిల్లా వెంకటగిరి బంగారుపేటలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వెంకటయ్య (80) అనే వృద్ధుడు వలంటీర్లు ఇంటికొచ్చి పింఛను ఇవ్వరన్న మనస్తాపంతో గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మూడో తేదీన పింఛను అందుతుందని తెలిసినా.. వృద్ధులు, దివ్యాంగులు మాత్రం సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు మంగళవారం కనిపించడం గమనార్హం.

First Published:  2 April 2024 10:41 AM GMT
Next Story