Telugu Global
Andhra Pradesh

ఛ‌లో విజయవాడలో ట్విస్ట్.. వ్యూహం మార్చిన ఉద్యోగులు..

ఈ దశలో సెప్టెంబర్ 1న ఉద్యోగులు విజయవాడ వచ్చి ఏం చేయాలి..? సీఎం కూడా కడప వెళ్తారు కాబట్టి, ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చి ప్రయోజనం ఏంటి..? అందుకే ఉద్యోగులు వ్యూహం మార్చారు.

ఛ‌లో విజయవాడలో ట్విస్ట్.. వ్యూహం మార్చిన ఉద్యోగులు..
X

ఓవైపు పోలీసులు హడావిడి పడిపోతున్నారు, మరోవైపు వైసీపీ నేతలు కూడా తలలు పట్టుకున్నారు. ఈ దశలో ఉద్యోగులు ప్రభుత్వానికి ట్విస్ట్ ఇచ్చారు. సెప్టెంబర్ 1న తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని 11వతేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అక్రమ నోటీసులు, అరెస్ట్ లతో ఇబ్బందికర వాతావరణం ఉందని, అందుకే ఈనెల 11న శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నామని ప్రకటన విడుదల చేశారు. దీంతో కొన్నిరోజులుగా హీటెక్కిన ఏపీ వ్యవహారాలు కాస్త శాంతించాయి.

వ్యూహాత్మకమేనా..?

ఇప్పటికే ఓసారి వాయిదా పడి, సెప్టెంబర్ 1న ఫిక్స్ అయిన ఏపీ కేబినెట్ భేటీ మరోసారి వాయిదా పడింది. వినాయక చవితి, సీఎం జగన్ కడప పర్యటనతో కేబినెట్ భేటీని ఈనెల 7కి వాయిదా వేసినట్టు చెబుతోంది ప్రభుత్వం. అయితే ఉద్యోగుల మిలియన్ మార్చ్ వల్లే కేబినెట్ భేటీ వాయిదా వేశారనే ప్రచారం కూడా ఉంది. ఈ దశలో సెప్టెంబర్ 1న ఉద్యోగులు విజయవాడ వచ్చి ఏం చేయాలి..? సీఎం కూడా కడప వెళ్తారు కాబట్టి, ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చి ప్రయోజనం ఏంటి..? అందుకే ఉద్యోగులు వ్యూహం మార్చారు. ప్రభుత్వం కేబినెట్ భేటీ వాయిదా వేసుకోవడంతో, వీరు కూడా మిలియన్ మార్చ్ కి గడువు పొడిగించారు.

పట్టుదలకు పోతారా..?

పెన్షన్ స్కీమ్ విషయంలో ఇరు వర్గాలు పట్టుదలతో ఉన్నాయి. తమ మాటే నెగ్గాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇచ్చిన హామీ అమలు చేయలేనప్పుడు అంత బెట్టు ఎందుకు అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. హామీ అమలు చేయకపోగా ఉద్యమాన్ని అణచివేసే కుట్ర చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఎప్పటికప్పుడు చర్చల పేరుతో పిలవడం, వారికి అనుకూలమైన నిర్ణయం చెప్పడం, అదే అమలవుతుందని ఆదేశాలివ్వడం.. ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లపాటు సాగదీసి, ఇప్పుడు సీపీఎస్ రద్దు కుదరదు, ప్రత్యామ్నాయంగా జీపీఎస్ తీసుకోండి అని ప్రభుత్వం చెప్పడం ఏమాత్రం సమంజసం కాదని అంటున్నారు ఉద్యోగులు. సంక్షేమ పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, ఉద్యోగులకోసం ఆమాత్రం చేయలేదా అనేది వారి వాదన. దీంతో సీపీఎస్ పై పీటముడి పడింది. తమ డిమాండ్ ఎంత బలంగా ఉందో చెప్పేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వారు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం వ్యూహం మార్చే సరికి, ఉద్యోగులు మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.

First Published:  30 Aug 2022 1:51 AM GMT
Next Story