Telugu Global
Andhra Pradesh

పోలవరం డ్యాన్స్ వర్సెస్ ప్యాకేజీ డ్యాన్స్..

తిట్టడం, తిట్టించుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కామన్ అయిపోయాయి. పవన్ కల్యాణ్ ని పదే పదే ఏపీ మంత్రులు టార్గెట్ చేస్తున్నారు, జనసేన వైపు నుంచి కూడా పవన్, నాగబాబు అంతే ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.

పోలవరం డ్యాన్స్ వర్సెస్ ప్యాకేజీ డ్యాన్స్..
X

ఏపీలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ముదిరి పాకాన పడుతున్నాయి. గతంలో ప్రెస్ మీట్ పెట్టి తిట్టుకునేవారు ఇప్పుడు ట్వీట్లతో యుద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు, జనసేన నేత నాగబాబు ఇద్దరూ ట్విట్టర్లో సెటైర్లు వేసుకున్నారు. నువ్వు పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఉంటే బాగుంటుందని నాగబాబు అంటే, నాకు మీలాగా ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ చేయడం రాదంటూ రాంబాబు బదులిచ్చారు.

చంద్రబాబు, పవన్ మీటింగ్, ఆ తర్వాత రణస్థలంలో జనసేన మీటింగ్.. ఈ రెండు సంఘటనల తర్వాత ఏపీలో పొలిటికల్ విమర్శలు మరింత పదునెక్కాయి. తాజాగా మంత్రి అంబటి రాంబాబు భోగి పండగ సందర్భంగా చేసిన డ్యాన్స్ వైరల్ అయింది. ఈ డ్యాన్స్ పై నాగబాబు ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. సంబరాల రాంబాబు గారు డ్యాన్స్ మహత్తరంగా చేశారని, అయితే ఆయన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి, ఇలా డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా ఉండేదని ఎద్దేవా చేశారు.


అవును నేను సంబరాల రాంబాబునే..

దీనికి మంత్రి రాంబాబు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. అవును నేను సంబరాల రాంబాబునే అని చెప్పారు. కానీ తాను మొహానికి ఎప్పుడూ రంగు వేయనని, ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయబోనని ఎద్దేవా చేశారు. పరోక్షంగా పవన్ కల్యాణ్ పై ఆయన సెటైర్లు వేశారు. ప్యాకేజీ అంటూ ఎద్దేవా చేశారు. పోలవరం తామే పూర్తి చేస్తామని, ఆ తర్వాత చంద్రబాబు, నాగబాబు పవన్ కల్యాణ్ తో డ్యాన్స్ చేయిస్తామని అన్నారు. దీంతో సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన శ్రేణులు కూడా ఆ ట్వీట్లను వైరల్ చేస్తున్నాయి. రెండు పార్టీల అభిమానులు సోషల్ మీడియా యుద్ధానికి సిద్ధమయ్యారు.


విమర్శలు శృతి మించుతున్నా అటు నాగబాబు కానీ, ఇటు రాంబాబు కానీ ఎవరూ తగ్గట్లేదు. తిట్టడం, తిట్టించుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కామన్ అయిపోయాయి. పవన్ కల్యాణ్ ని పదే పదే ఏపీ మంత్రులు టార్గెట్ చేస్తున్నారు, జనసేన వైపు నుంచి కూడా పవన్, నాగబాబు అంతే ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.

First Published:  16 Jan 2023 8:37 AM GMT
Next Story