Telugu Global
Andhra Pradesh

శ్రీవాణి ట్రస్ట్ పై మరోసారి టీటీడీ వివరణ

కావాల్సిన వారికే ఆలయాల నిర్మాణ కాంట్రాక్ట్ పనులు ఇస్తున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. నిబంధనల ప్రకారమే నిర్మాణాల కాంట్రాక్ట్ లు ఇస్తున్నామని వివరించారు.

శ్రీవాణి ట్రస్ట్ పై మరోసారి టీటీడీ వివరణ
X

శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారాలపై మరోసారి టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. ట్రస్ట్ పై కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటికే 9 లక్షల మంది దర్శనం చేసుకున్నట్టు తెలిపారు. ట్రస్ట్ పై మరో రకమైన ఆరోపణలు కూడా తమ దృష్టికి వచ్చాయన్నారు ధర్మారెడ్డి. కావాల్సిన వారికే ఆలయాల నిర్మాణ కాంట్రాక్ట్ పనులు ఇస్తున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. నిబంధనల ప్రకారమే నిర్మాణాల కాంట్రాక్ట్ లు ఇస్తున్నామని వివరించారు. పార్వేట మండపాన్ని కూల్చేస్తున్నామనేవి కూడా తప్పుడు ఆరోపణలేనని, జీర్ణోద్ధరణలో భాగంగానే పార్వేట మండపం నిర్మాణం జరుగుతోందన్నారు ధర్మారెడ్డి.

జూన్ నెల ఆదాయం రూ.116.14 కోట్లు..

తిరుమల శ్రీవారిని జూన్ నెలలో 23 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు టీటీడీ అధికారులు. హుండీ ద్వారా రూ. 116.14 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. జూన్ నెలలో 1.6 కోట్ల లడ్డులను భక్తులకు విక్రయించింది టీటీడీ.

తిరుమల కొండపైనే కాకుండా.. ఘాట్ రోడ్డు, నడక మార్గాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుతామంటున్నారు అధికారులు. ప్లాస్టిక్ రహిత తిరుమలను సాకారం చేస్తామంటున్నారు. ఘాట్‌ రోడ్డులో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో వన్యప్రాణులకు హాని కలుగుతోందని చెప్పారు. అందుకే వ్యర్థాలు వేసేందుకు ఆర్టీసీ బస్సుల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలినడక మార్గంలో చిరుత దాడిలో గాయపడిన కౌశిక్‌ కోలుకున్నాడని చెప్పారు. రాత్రి వేళ గాలిగోపురం నుంచి వచ్చే భక్తులు గోవింద నామస్మరణతో గుంపుగా రావాలని సూచించారు.

First Published:  16 July 2023 6:54 AM GMT
Next Story