Telugu Global
Andhra Pradesh

ఏయ్ చిరుతల్లారా..? ఇప్పుడు రండి చూసుకుందాం

ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గంలో భక్తులకు 10వేల కర్రలు అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. వీటికోసం రూ.45వేలు ఖర్చయిందని తెలిపారు అధికారులు. మరో 10వేల కర్రలకు ఆర్డర్ ఇచ్చారు కూడా.

ఏయ్ చిరుతల్లారా..? ఇప్పుడు రండి చూసుకుందాం
X

తిరుమల భక్తుల చేతికి కర్రలు వచ్చేశాయి. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు ఈ కర్రలు అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చేతిలో కర్ర ఉంటే మనుషుల జోలికి జంతువులు రావనే శాస్త్రీయ వాదన ఉందని చెప్పారు కరుణాకర్ రెడ్డి. కర్ర తోడు వల్ల కాలినడక భక్తులలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారాయన. చేతి కర్రల పంపిణీ అంటే చేతులు దులుపుకొనే ప్రక్రియ కాదని చెప్పారు. మెట్ల మార్గంలో టీటీడీ భద్రత సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారన్నారు. చేతికర్రలపై వస్తున్న విమర్శలపై కూడా కరుణాకర్ రెడ్డి మరోసారి స్పందించారు. చేతి కర్ర ఇచ్చి తమ పని అయిపోయింది అనుకోవడం లేదని, విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

10వేల కర్రలు..

ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గంలో భక్తులకు 10వేల కర్రలు అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. వీటికోసం రూ.45వేలు ఖర్చయిందని తెలిపారు అధికారులు. మరో 10వేల కర్రలకు ఆర్డర్ ఇచ్చారు కూడా. భక్తులకు రక్షణ చర్యల్లో భాగంగానే చేతి కర్రలు అందిస్తున్నామన్నారు. పూర్వం ప్రజలు, రైతులకు చేతికర్ర జీవన విధానంలో ఓ భాగమని, తిరుమల వచ్చేవారు కూడా కర్రలు తెచ్చుకునేవారిని, కానీ ఇప్పుడు అవి కనుమరుగయ్యాయని చెప్పారు. అలిపిరి మెట్ల మార్గంలో ఇచ్చిన చేతి కర్రలను ఏడో మైలు నరసింహస్వామి ఆలయం వద్ద తిరిగి సిబ్బంది స్వాధీనం చేసుకుంటారన్నారు.

మరో చిరుత ఎక్కడ..?

ఇటీవల 4 చిరుతలను బంధించింది టీటీడీ. మరో చిరుత ట్రాప్ కెమెరాలకు చిక్కినా బోనులో పడలేదు. ఆ చిరుతకోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో చిరుత భయం పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి కర్రలను అందించింది టీటీడీ. భక్తుల భయాలు పూర్తిగా తొలగిపోయే వరకు సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారని, వారికి రక్షణగా నిలుస్తారని తెలిపారు అధికారులు. కర్రలతో వారికి అదనపు భద్రత ఉంటుందని, ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు.

First Published:  6 Sep 2023 2:56 PM GMT
Next Story