Telugu Global
Andhra Pradesh

వైసీపీ వర్సెస్ టీడీపీ.. మధ్యలో టీఆర్ఎస్..

టీడీపీ, వైసీపీ మాటల యుద్ధంలో అనూహ్యంగా ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి చేరినట్టయింది. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్ని ఉదాహరణగా చూపిస్తూ వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు టీడీపీ నేతలు.

వైసీపీ వర్సెస్ టీడీపీ.. మధ్యలో టీఆర్ఎస్..
X

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీకి వచ్చి నలుగురు టీచర్లతో మాట్లాడితే మన ప్రభుత్వం పరువు పోతుంది - ఎమ్మెల్సీ అశోక్ బాబు

తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టకుండా కేసీఆర్ దమ్ము చూపించారు. ఏపీలో అప్పుకోసం జగన్, రైతుల్ని మోసం చేస్తున్నారు. - మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

ఇప్పటి వరకూ ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ఫైట్ జరిగింది. కానీ ఇప్పుడీ ఫైట్ లోకి అనుకోకుండా టీఆర్ఎస్ వచ్చి చేరింది. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీలో సెగలు రేపుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా చేశాయి.

ఇంతకీ హరీష్ ఏమన్నారు..?

ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన తెలంగాణ మంత్రి హరీష్ రావు.. ఉపాధ్యాయులకు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని, ఏపీలో మాత్రం జీతాలు పెంచాలని అడిగిన టీచర్లపై ప్రభుత్వం కేసులు పెడుతోందని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ లాగా మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ అంగీకరించి ఉంటే అప్పు దొరికేదని, కానీ రైతులకు నష్టం చేకూర్చే పని సీఎం కేసీఆర్ ఎప్పటికీ చేయరని చెప్పారు.

వైసీపీ కౌంటర్లు..

హరీష్ రావు వ్యాఖ్యలతో ఏపీ మంత్రులకు చురుకు పుట్టింది. మా టీచర్ల పరిస్థితి మీకేం తెలుసు, కావాలంటే ఓసారి మా రాష్ట్రానికి వచ్చి నలుగురు టీచర్లతో మాట్లాడితే అర్థమవుతుంది.. అంటూ హరీష్ రావుకి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సవాల్ విసిరారు. సరిగ్గా ఈ సవాల్ ని బేస్ చేసుకుని టీడీపీ మళ్లీ విమర్శలు మొదలు పెట్టింది. నిజంగానే హరీష్ రావు ఏపీకి వచ్చి టీచర్లతో మాట్లాడితే మన డొల్లతనం బయటపడుతుందని, రాష్ట్రం పరువుపోతుందని సెటైర్లు వేశారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. వైన్ షాపుల వద్ద కాపలా పెట్టారని చెప్పాలా..? మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్ లోడ్ చేయిస్తున్నారని చెప్పాలా..? అని ప్రశ్నించారు. పొరపాటున కూడా హరీష్ రావు తమ రాష్ట్రానికి రావొద్దని, వచ్చినా టీచర్ల పరిస్థితి ఆరా తీయొద్దంటూ వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు అశోక్ బాబు.

మోటార్లు, మీటర్లు, మంటలు..

ఇక మోటార్లకు మీటర్లు పెట్టడం కేవలం అప్పు పుట్టడం కోసమేనంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రులు అమర్నాథ్, మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల ఘాటుగా బదులిచ్చారు. మా రాష్ట్రం సంగతి మీకెందుకు అంటూ నిలదీశారు. ఈ మీటర్ల వ్యవహారాన్ని కూడా టీడీపీ చక్కగా ఉపయోగించుకుంది. మీటర్లు పెట్టడం కేవలం అప్పుకోసమే అని, ఈ విషయంపై పక్క రాష్ట్రాల నేతలు కూడా ఏపీని విమర్శిస్తున్నారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి వైసీపీని టార్గెట్ చేశారు. కేసీఆర్ ని చూసి జగన్ పాలన నేర్చుకోవాలని సెటైర్లు వేశారు.

ఉన్నమాటంటే ఉలుకా..

అటు టీఆర్ఎస్ నుంచి కూడా వైసీపీ నేతలపై కౌంటర్లు పడుతున్నాయి. హరీష్ రావుపై ఏపీ మంత్రుల వ్యాఖ్యల్ని ఖండించారు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఏపీ విషయంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ఉన్నమాటంటే అంత ఉలుకెందుకని ఏపీ మంత్రుల్ని విమర్శించారు. మొత్తమ్మీద టీడీపీ, వైసీపీ మాటల యుద్ధంలో అనూహ్యంగా ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి చేరినట్టయింది. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్ని ఉదాహరణగా చూపిస్తూ వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు టీడీపీ నేతలు.

First Published:  1 Oct 2022 2:10 AM GMT
Next Story