Telugu Global
Andhra Pradesh

అప్పుడు చంద్రబాబు మొక్క, ఇప్పుడు జగన్ పెట్టిన భిక్ష

పొగడ్తల విషయానికొస్తే ఈరోజు విడదల రజిని కాస్త ఎమోషనల్ కావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. టీడీపీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా ఆమెను విమర్శిస్తూ పోస్టింగ్ లు పెట్టారు.

అప్పుడు చంద్రబాబు మొక్క, ఇప్పుడు జగన్ పెట్టిన భిక్ష
X

"అన్నా, నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటానన్నా, నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెబుతున్నానన్నా, ఈ రాజకీయ జీవితం, ఈ ఎమ్మెల్యే పదవి, ఈ మంత్రి పదవి, ఈ రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షే అన్నా, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నా, మీకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనన్నా.." అంటూ చిలకలూరిపేట సభలో భావోద్వేగానికి గురయ్యారు మంత్రి విడదల రజిని. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని మంత్రి విడదల రజిని నియోజకవర్గం నుంచి ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా బహిరంగ వేదికపై జగన్ రుణం తీర్చుకోలేనని చెప్పారు మంత్రి రజిని.

అంతా బాగానే ఉంది కానీ, సరిగ్గా ఇలాంటి స్పీచ్ ఎక్కడో విన్నట్టుందే అని సామాన్య ప్రజలకు అనిపించక మానదు. అప్పట్లో చంద్రబాబు సభలో కూడా విడదల రజిని ఇలాగే మాట్లాడారు. అప్పుడే ఆమె అమెరికానుంచి వచ్చానన్నారు. హైటెక్ సిటీలో చంద్రబాబు నాటిని మొక్కని తాను అని, ఇప్పుడిలా ఎదిగానని, మంచి బిజినెస్ చేస్తున్నాని, వందలాది మందికి ఉపాధి చూపించగలుగుతున్నానని గర్వంగా చెప్పారు. కట్ చేస్తే ఆమె ఆ తర్వాత వైసీపీలో చేరి చంద్రబాబుని చెడామడా తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పొగడ్తల విషయానికొస్తే ఈరోజు విడదల రజిని కాస్త ఎమోషనల్ కావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. టీడీపీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా ఆమెను విమర్శిస్తూ పోస్టింగ్ లు పెట్టారు.


అప్పట్లో ఉండవల్లి శ్రీదేవి..

జగన్ ని పొగడ్తల్లో ముంచెత్తడంలో పార్టీ ఎమ్మెల్యేలు ఏమాత్రం మొహమాటపడరనే విషయం తెలిసిందే. అప్పట్లో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జగన్ గురించి అసెంబ్లీలో గొప్పగా చెప్పారు. తన గుండె కూడా జగన్ జగన్ అని కొట్టుకుంటుందని అన్నారు. పులిలాంటి జగన్ పుడతాడని ముందుగానే ఊహించి పులివెందులకు ఆ పేరు పెట్టారని కూడా అన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమె పార్టీనుంచి సస్పెండ్ అయ్యారు. తనకు పార్టీ నాయకులనుంచి ప్రాణ హాని ఉందంటున్నారు.

ఇప్పుడు మంత్రి రజినిని కూడా ఇలాగే కంపేర్ చేస్తూ పోస్టింగ్ లు పెడుతున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి రానప్పుడు నాయకులు చేసిన ప్రసంగాలు ప్రజలకు అంతగా గుర్తిండేవి కావు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పాత జ్ఞాపకాలన్నీ కళ్లముందుకు వచ్చేస్తున్నాయి. అందులోనూ ఇలా దొరికిపోయినప్పుడు ట్రోలింగ్ మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది కూడా ఓరకంగా పబ్లిసిటీయే అనుకుని సరిపెట్టుకుంటున్నారు నేటితరం నేతలు.

First Published:  6 April 2023 10:54 AM GMT
Next Story