Telugu Global
Andhra Pradesh

ఏపీలో ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. గిరిజనుల కష్టాలు తీరేనా..?

గిరిజన ఆవాసాలు ఎక్కువగా ఉన్న సీతంపేట, పార్వతీపురం, బుట్టాయగూడెం, రంపచోడవరం, దోర్నాలలో 246 కోట్ల రూపాయలతో ఐదు మల్టీ స్పెషల్ ఆస్పత్రుల ఏర్పాటు చేస్తున్నారు.

ఏపీలో ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. గిరిజనుల కష్టాలు తీరేనా..?
X

ఏపీ ప్రభుత్వం వైద్య సదుపాయాల కోసం మరిన్ని నిధులు ఖర్చు పెడుతోందని చెప్పారు వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు. ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం 246 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు. ఐటీడీఏల పరిధిలో ఐదు ప్రాంతాల్లో గిరిజనుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయబోతున్నారు. సహజంగా ప్రతి రాష్ట్రంలోనూ గిరిజన ఆవాసాలు సుదూరంగా, మౌలిక సదుపాయాలకు దూరంగా ఉంటాయి. అత్యవసర వైద్య సేవల కోసం వారికి అంబులెన్స్ సౌకర్యం కూడా కొన్నిసార్లు అందుబాటులో ఉండదు. డోలీ కట్టుకుని గర్భిణులను ఆస్పత్రులకు తరలించే సన్నివేశాలు ఇంకా కోకొల్లలు. అయితే అలాంటి వారందరికీ సమీప ప్రాంతాల్లోనే ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. గిరిజన ఆవాసాలు ఎక్కువగా ఉన్న సీతంపేట, పార్వతీపురం, బుట్టాయగూడెం, రంపచోడవరం, దోర్నాలలో 246 కోట్ల రూపాయలతో ఐదు మల్టీ స్పెషల్ ఆస్పత్రుల ఏర్పాటు చేస్తున్నారు.

గిరిజనుల కష్టాలు తీరేనా..?

గిరిజనుల కోసం ప్రత్యేకంగా పథకాలు అమలులో ఉన్నా కూడా వాటి ఫలాలు అందుకోవడంలో మాత్రం వారు వెనుకబడే ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రవాణా సౌకర్యం లేకపోవడం, ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడంతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల కాన్సెప్ట్ గిరిజనులకు ఉపయోగపడితే ఆ ఆస్పత్రులకు సార్థకత చేకూరుతుంది.

గ్రామీణ వైద్యంపై దృష్టి..

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు మెరుగు పరిచేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు కృష్ణబాబు. 1700 కోట్ల రూపాయల వ్యయంతో 10 వేల విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారాయన. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చే విధంగా డెడ్ లైన్ పెట్టుకుని మరీ పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌ల కోసం 368 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. 203 చోట్ల పాత భవనాలకు మరమ్మతులు చేస్తున్నామని, మరో 353 ప్రాంతాల్లో కొత్త భవనాల్లో వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

ఈ నెల నుంచే ఫ్యామిలీ డాక్టర్..

ఏపీలో ఈ నెల నుంచి ఫ్లామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని ప్రయోగాత్మకంగా అమలులోకి తెస్తున్నారు. ప్రతి సచివాలయ పరిధిలో ఓ డాక్టర్ ఉండటంతోపాటు, మరో డాక్టర్ ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ ప్రతి ఇంటికీ వెళ్తారని అధికారులు చెబుతున్నారు. వైద్య సౌకర్యాలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నాడు-నేడుతో మార్పుకి శ్రీకారం చుట్టింది. కొత్తగా మెడికల్ కాలేజీలు, ట్రైబల్ ఆస్పత్రులతో కార్పొరేట్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేయాలనే ప్రయత్నం చేస్తోంది.

First Published:  2 Sep 2022 6:00 AM GMT
Next Story