Telugu Global
Andhra Pradesh

వీళ్ళ ట్రయాంగిల్ స్టోరీ భలేగుంది

కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో షర్మిల మరింత దూకుడుగా రెచ్చిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ మీద అంతగా రెచ్చిపోతున్న షర్మిల జనసేన అధినేత పవన్ మీద మాత్రం ఇప్పటివరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు.

వీళ్ళ ట్రయాంగిల్ స్టోరీ భలేగుంది
X

రాజకీయాల్లో చాలావరకు ప్రతి పార్టీ మరో పార్టీకి ప్రత్యర్థి పార్టీగానే ఉంటుంది. ఎక్కడో పొత్తులో ఉన్న పార్టీలు తప్ప. పొత్తు పార్టీలని మినహాయిస్తే మిగిలిన పార్టీల అధినేతలు, అధ్యక్షులు ఏ చిన్న అవకాశం దొరికినా ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతుంటారు. అయితే ఇప్పుడు ఏపీలో మాత్రం కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఎలాగంటే.. వైసీపీ ఒంటరిగానే పోటీచేస్తోంది కాబట్టి మిగిలిన అన్ని పార్టీలు అధికారపార్టీకి ప్రత్యర్థి పార్టీలే. కాబట్టి అందరు కలిసి లేదా విడివిడిగా జగన్మోహన్ రెడ్డిపైన విరుచుకుపడిపోతున్నారు.

జనసేన-బీజేపీ మిత్రపక్షాలు. పేరుకు మిత్రపక్షాలే అయినా యాక్షన్లో కనబడటంలేదు. పైగా బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న టీడీపీతో జనసేన అధినేత పవన్ చేతులు కలిపారు. కాబట్టి నిజమైన మిత్రపక్షాలంటే టీడీపీ, జనసేన అనే చెప్పుకోవాలి. అందుకనే బీజేపీ దానిష్టంప్రకారం ఒంటరిగానే కార్యక్రమాలు చేసుకుంటోంది. వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్తగా కాంగ్రెస్ కూడా బరిలోకి దూకింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చంద్రబాబు, పవన్ జాయింటుగాను, విడివిడిగాను జగన్ను టార్గెట్ చేస్తున్నారు.

వీళ్ళకన్నా కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో షర్మిల మరింత దూకుడుగా రెచ్చిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ మీద అంతగా రెచ్చిపోతున్న షర్మిల జనసేన అధినేత పవన్ మీద మాత్రం ఇప్పటివరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వాన్ని, నరేంద్రమోడీని షర్మిల టార్గెట్ చేస్తున్నారు. అయితే షర్మిలగురించి బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు. అంటే పవన్ గురించి షర్మిల మాట్లాడటంలేదు. అలాగే షర్మిల గురించి పురందేశ్వరి నోరిప్పటంలేదు. మరి వీళ్ళమధ్య ఈ ట్రయాంగిల్ స్టోరీ ఏమిటో అర్థంకావటంలేదు.

జాతీయస్థాయిలో బీజేపీ-కాంగ్రెస్ బద్ధ శతృవుల్లాగ గొడవలు పడుతుంటాయి. అలాంటప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కేంద్రాన్ని, మోడీని అన్నేసి మాటలంటుంటే బీజేపీ అధ్యక్షురాలు సమాధానం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు..? ఇటు చంద్రబాబుతో అటు బీజేపీతో ఏకకాలంలో రెండుపడవలపైన ప్రయాణంచేస్తున్న పవన్ గురించి షర్మిల ఎందుకు మాట్లాడటంలేదు..? ఏపీ ప్రయోజనాలను కేంద్రం తుంగలో తొక్కేస్తున్నప్పుడు మిత్రపక్షంగా జనసేన అధినేత పవన్ కూడా బాధ్యత వహించాల్సిందే కదా. అయినా పవన్ పైన షర్మిల ఏమీ మాట్లాడటంలేదు. ఈ ట్రయాంగిల్ స్టోరీ గుట్టు జనాలకు ఏమాత్రం అర్థంకావటంలేదు.

First Published:  31 Jan 2024 5:20 AM GMT
Next Story